వైఎస్ వివేకా హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరి చెప్పే మాటలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అతను చెప్పినదాన్ని ఎల్లో మీడియా వండివారుస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆక్షేపించారు. ప్రజలకు సంబంధించిన అంశాలను వదిలేసి ఇలాంటి అంశాల ద్వారా రాజకీయ లబ్ధికోసం విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నాడు వైఎస్ పై కూడా ఇదే రకంగా దుష్ప్రచారం చేశారని, జగన్ కేసుల సమయంలో కూడా సిబిఐ కంటే ముందే మీడియాలో వార్తలు వచ్చేవని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
వివేకా కేసులో సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని, తాము చెప్పింది వినడంలేదన్న విషయాన్ని పలువురు నిందితులు బైటకు వచ్చి చెప్పిన విషయాన్ని సజ్జల ప్రస్తావించారు. అన్ని కోణాల్లో విచారణ చేయకుండా వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను నిందితులుగా చేసే ప్రయత్నం జరుగుతోందని, అందుకే దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే విచారణ అధికారి రామ్ సింగ్ ను మార్చి కొత్త బృందాన్ని నియమించారని అన్నారు. ఏప్రిల్ 30 లోగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలి కాబట్టి ఏదో విధంగా పూర్తి చేయాలని చూస్తున్నారని, అంతే కానీ ఈ బృందం కొత్తగా విచారించిన అంశాలేవీ లేవని సజ్జల అభిప్రాయపడ్డారు.
భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలపై కేసు నిలబడదని, ఎందుకంటే దీనిలో వారి పాత్ర ఏమీ లేదని సజ్జల స్పష్టం చేశారు. కానీ కుటుంబ సభ్యులే ఈ హత్య చేశారన్న అంశం వినడానికే అసహ్యంగా ఉంటుందని, అంతిమంగా ఈ కేసు నిలబడే ప్రసక్తే ఉండబోదని.. కానీ ఈలోగా ఎల్లో మీడియా యధేచ్ఛగా విచారణ చేస్తోందని, తద్వారా ప్రజల్లోకి తప్పుడు ప్రచారం తీసుకెళ్ళి వారి మనసులను కలుషితం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని సజ్జల విశ్వాసం వ్యక్తం చేశారు.