Sunday, February 23, 2025
Homeసినిమాలక్షలాది మంది కలల మెరుపుతీగ

లక్షలాది మంది కలల మెరుపుతీగ

తెలుగు తెరకు ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు పరిచయమయ్యారు. వాళ్లలో కొంతమంది మాత్రమే ఆ తరువాత కాలంలోను నిలబడగలిగారు. అలాంటి వాళ్లలో శ్రీదేవి ముందువరుసలో కనిపిస్తారు. ఎన్నో సినిమాల్లో శ్రీదేవి బాలనటిగా మెప్పించారు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. అలా బాలనటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, టీనేజ్ లోకి అడుగుపెట్టిన వెంటనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి .. స్టార్ స్టేటస్ ను అందుకున్న కథానాయికగా మీనా కనిపిస్తారు.

తెలుగు .. తమిళ .. మలయాళ … హిందీ భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా 20కి పైగా సినిమాల్లో నటించిన మీనా,  కథానాయికగా ‘నవయుగం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ తరువాత చేసిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా ఆమె కెరియర్ ను మలుపు తిప్పేసింది. ఈ సినిమాలో నాజూకుగా .. మెరుపుతీగలా ఉన్న మీనాను చూసిన ప్రేక్షకులు, బాలనటిగా బొద్దుగా ఉన్న ఆ పిల్లేనా ఈ అమ్మాయి అంటూ ఆశ్చర్యపోయారు. తామరపువ్వుల్లా విచ్చుకున్న కళ్లతో తమలపాకు తీగలా మీనా ప్రేక్షకుల హృదయాలను అల్లుకుపోయారు.

ఈ సినిమా నుంచి కథానాయికగా మీనా ఇక వెనుదిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోయిన్స్ రేసులోకి ఎంటర్ కావడానికి ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. చిరంజీవి .. బాలకృష్ణ … నాగార్జున .. వెంకటేశ్ .. మోహన్ బాబు .. జగపతిబాబు .. శ్రీకాంత్ తదితరులతో ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. చిరూతో జోడీకట్టిన ‘ముఠామేస్త్రి’  .. బాలకృష్ణతో చేసిన ‘బొబ్బిలి సింహం’ .. ‘నాగార్జునతో చేసిన ‘అల్లరి అల్లుడు’ .. ‘ప్రెసిడెంట్గారి పెళ్లాం’ .. వెంకీతో జోడీ కట్టిన ‘చంటి’ .. ‘అబ్బాయిగారు’ .. ‘సుందరకాండ’ సినిమాలు ఆమె కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచాయి.

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలోనే మీనా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె ముసిముసినవ్వులు .. ముద్దుముద్దు మాటలు .. కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడే విధానం కుర్రకారుకు విపరీతంగా నచ్చేశాయి. పేరుకు తగినట్టుగానే చేపల్లాంటి కళ్లను .. కలువ రేకుల్లాంటి రెప్పలతో టపటపలాడిస్తూ కుర్రమనసులను ఆమె ఉక్కిరిబిక్కిచేశారు. ఆమె చీరకడితే పండుగలన్నీ తెరపైకి పరిగెత్తుకు వచ్చినట్టుగా ఉండేది. అలా ముద్దబంతిలాంటి ఆమె రూపం ప్రేక్షకులను ముగ్ధులను చేసింది.

అయితే మొదటి నుంచి కూడా మీనా గ్లామర్ పరంగా తన హద్దులను దాటలేదు. స్కిన్ షో చేయడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నించింది లేదు. అవసరానికి మించి ఆమె తెరపై ఎప్పుడూ కనిపించలేదు. ఈ విషయంలో తాను ఏర్పరుచుకున్న నియమానికి కట్టుబడే ఆమె తన కెరియర్ ను కొనసాగించారు. ఈ కారణంగానే గ్లామర్ హీరోయిన్స్ గా ఆ సమయంలో దూసుకుపోతున్న రమ్యకృష్ణ .. రోజా .. రంభ వంటి కథానాయికల పోటీని ఆమె గట్టిగానే ఎదుర్కోవలసి వచ్చింది. తనకి తగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఆమె తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

ఒక వైపున వరుసగా తెలుగు సినిమాలు చేస్తూనే, మరో వైపున తమిళ … మలయాళ .. కన్నడ సినిమాలను కూడా మీనా చేస్తూ వెళ్లారు. ఇలా ఈ నాలుగు భాషల్లో ఒక దశాబ్దం పాటు తిరుగులేని కథానాయికగా తన జోరును కొనసాగించారు. తమిళంలో ఆమె రజనీకాంత్ .. కమల్ తోను సినిమాలు చేశారు. రజనీ సరసన నాయికగా చేసిన ‘ముత్తు’ .. కమల్ జోడీగా చేసిన ‘భామనే సత్యభామనే’ తెలుగులోనూ సంచలన విజయాలను నమోదు చేశాయి. మీనా సక్సెస్ గ్రాఫ్ ను రాకెట్ స్పీడ్ తో పెంచుతూ వెళ్లాయి.

తమిళంలో ఆమె విజయ్ కాంత్ .. సత్యరాజ్ .. శరత్ కుమార్ .. అర్జున్ వంటి హీరోల కాంబినేషన్లోను భారీ విజయాలను అందుకున్నారు. ఇక కన్నడ .. మలయాళ సినిమాల్లోను అప్పటి స్టార్ హీరోల సరసన ఆమె ఆడిపాడారు. ఏక కాలంలో ఈ భాషలన్నింటిలోను ఆమె స్టార్ హీరోయిన్ గానే కొనసాగడం విశేషం. తాను బాలనటిగా చేసిన భాషల్లోనే కథానాయికగా అగ్రస్థానాన్ని అందుకోవడం మరో విశేషం.

మీనా తరువాత కెరియర్ ను మొదలుపెట్టిన చాలామంది అవకాశాలు లేని కారణంగా తమ ప్రయాణాన్ని ఆపేశారు. కానీ మీనా మాత్రం ఇప్పుడు కూడా నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తన వయసుకు తగిన పాత్రలను చేస్తూనే ఉన్నారు. తెరపై నిండుదనానికి నిదర్శనంగా .. పండుగదనానికి నిర్వచనంలా కనిపించే మీనా పుట్టినరోజు నేడు(సెప్టెంబర్ 16). ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

(బర్త్ డే స్పెషల్)

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్