A Friend in need is a friend indeed అనేది ఎప్పటినుంచో వింటున్న సూక్తి. జీవితంలో మనం ఏమి సంపాదించినా, లేకపోయినా ఒక మంచి ఫ్రెండ్ ను సంపాదించాలంటారు. కష్టనష్టాల్లో మనకు మనో ధైర్యం ఇచ్చేది, ఓదార్చేది నిజమైన మిత్రులే. తెలుగు సినిమాల్లో కూడా ‘స్నేహమేరా జీవితం- స్నేహమేరా శాశ్వతం’ ‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’…. ‘దోస్త్ మేరా దోస్త్’ … అంటూ మనసును కదిలించే ఎన్నోపాటలు కూడా వచ్చాయి.
ప్రపంచీకరణ ప్రభావం సమాజంలోని అన్ని రంగాలనూ ప్రభావితం చేసినట్లు స్నేహాన్ని కూడా ప్రభావితం చేసింది. ఈ ఉరుకులు, పరుగుల యాంత్రిక జీవనంలో మానవుడు తన గురించి కూడా తాను ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటప్పుడు స్నేహితుల గురించి, వారి బాగోగుల గురించి పట్టించుకునే తీరిక అస్సలు ఉండడం లేదు. ఒకప్పుడు స్నేహితులు కుటుంబ సమేతంగా ఒకరి ఇళ్ళకు ఒకరు వెళ్ళడం, రోజుల తరబడి వారితో ఆనందంగా గడపడం ఈ తరం వరకూ మాత్రమే గుర్తుండే తీపి జ్ఞాపకాలు… ఇప్పుడు ఏవేడుక జరిగినా, చావు సంభవించినా కుదిరితే ఆ సమయానికి ఫంక్షన్ హాల్ కో… స్మశాన వాటికకో నేరుగా వెళ్లి తిరిగి వచ్చేస్తున్నాం. అదీ కుదరక పొతే ఎలాగూ సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి మనమే ఓ ఫోటో పెట్టి ‘రిప్’ (rest in peace); ‘హెచ్ బి డి’ (Happy Birth Day); ‘హెచ్ ఎం ల్’ (Happy Married Life) లాంటి పొడి అక్షరాలతో మన సంతాపాన్నో, శుభాకాంక్షలనో తెలియజేస్తున్నాం. ఏడాదికోసారి ఆగస్ట్ నెలలో వచ్చే ఫ్రెండ్ షిప్ డే మనకు స్నేహాన్ని, స్నేహితులను పూర్తిగా మర్చి పోకుండా గుర్తు చేస్తుంటుంది.
స్నేహం అనేది మానసిక ఉల్లాసం తో పాటు ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుందని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. స్నేహితులను స్వయంగా కలిసి వారితో ముచ్చటించడం, చిన్ననాటి ఫ్రెండ్స్ ను కలిసి వారితో సరదాగా గడిపి నాటి జ్ఞాపకాలను నెమర వేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వెల్లడయ్యింది. మనం సామాజిక మాధ్యమాల్లో ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు మన స్నేహితుల నుంచి ఒక రిప్లై వస్తే అది మనకు ఎంతో సంతోషాన్నిస్తుంది. అలాంటిది కనీసం ఏడాదికో, రెండేళ్ళకో స్నేహితులను కలుసుకొని వారితో ఓ పూట గడిపితే ఆ ఉల్లాసం, ఉత్తేజం మనసుపై, ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది.
కరోనా సమయంలో సంభవించిన మరణాల్లో దాదాపు 40శాతం వరకూ మానసిక ఆందోళన… కుటుంబాన్ని, పిల్లలను విడిచి మూడు వారాలపాటు ఒంటరిగా ఉండడం వల్ల జరిగినవే. అలాంటి సమయంలో స్నేహితులు ఈ వైరస్ బారిన పడిన వారితో తరచుగా మాట్లాడి, వారికి ధైర్యం చెప్పి ఉంటె వీరిలో చాలా మందిని మనం కోల్పోవాల్సి ఉండేది కాదు.
మనం తీసుకుంటున్న ఆహారం…. ఉద్యోగ, వ్యాపారాల్లో మానసిక ఒత్తిడి, సామాజిక సమస్యలపై, మన చుట్టూ జరుగుతున్న విషయాలపై అనవసర ఆందోళన… వ్యక్తిగత విషయాలు… పనికిరాని అంశాలపై ఆలోచనలు… ఇలా అనేక సమస్యలు, తద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు ఎందరినో అర్ధంతరంగా బలిగొంటున్తున్నాయి. ఇలాంటి సమయంలో మనసుకు స్వాంతన చేకూర్చే స్నేహితులు.. వారి ఆలింగనం…మన ఆరోగ్యాన్ని కొంతమేరకు కాపాడుతుంది… కాబట్టి కనీసం నెలకోసారి అయినా ఫ్రెండ్స్ తో మాట్లాడడం, ఏడాదికి రెండుమూడు సార్లు వారిని స్వయంగా కలిసి కొంత సమయం గడపడం అలవాటు చేసుకుంటే మంచిది.
Also Read :