జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. బండిపొర జిల్లాలోని సొద్‌నార సంబాల్ ప్రాంతంలో ఓ వలస కార్మికుడిని కాల్చిచంపారు. బందిపూర్ జిల్లాలోని అజాస్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు కార్మికుడిని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారని, దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అక్కడ మరణించాడని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. మృతుడు బీహార్‌లోని మాధేపురాకు చెందిన మహ్మద్ అమ్రెజ్ గా గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులు మహ్మద్ అమ్రేజ్ పై కాల్పులు జరిపారని.. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ మరణించినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.
కాగా.. గురువారం రాజౌరి జిల్లాలోని సైనిక శిబిరంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో సైనికులు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. ఈ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఉగ్రవాదులు వలస కార్మికుడిని లక్ష్యంగా చేసుకుంటూ దాడికి పాల్పడ్డారు. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
Also Read : ఆర్మీ క్యాంప్‌పై ఉగ్ర దాడి.. అమరులైన ముగ్గురు జవాన్లు