Friday, March 29, 2024
HomeTrending Newsమైనింగ్ లీజుల జారీలో జాప్యం వద్దు: పెద్దిరెడ్డి

మైనింగ్ లీజుల జారీలో జాప్యం వద్దు: పెద్దిరెడ్డి

No delay: ప్రభుత్వానికి ఖనిజ ఆధారిత ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఇప్పటికే గనులశాఖలో సీఎం ఆదేశాల మేరకు పలు సంస్కరణలను తీసుకువచ్చామని అన్నారు. మైనింగ్ లీజుల విషయంలో అత్యంత పారదర్శకతను అమలులోకి తీసుకువస్తూ ఈ-ఆక్షన్ విధానంను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు.

సచివాలయంలోని మూడోబ్లాక్ లో బుధవారం గనులు, అటవీ, పర్యావరణశాఖ అధికారులతో మైనింగ్ లీజులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గనులశాఖ ద్వారా ఈ-ఆక్షన్ లో మైనింగ్ అనుమతులను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించామని, దీనివల్ల ఔత్సాహికులు పలువురు మైనింగ్ రంగంలోకి వస్తున్నారని అన్నారు. ఇదే క్రమంలో గతంలో మైనింగ్ లీజులకు దరఖాస్తులు చేసుకుని, పర్యావరణ, అటవీ అనుమతులు లేక మైనింగ్ చేపట్టకుండా ఉన్న లీజులపై కూడా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

పర్యావరణ, అటవీ, గనులశాఖల మధ్య సమన్వయం ఉంటేనే పెండింగ్ లీజుల విషయంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు. గనులశాఖ నుంచి లీజులు పొందినప్పటికీ అటు పర్యావరణ, అటవీశాఖల నుంచి అవసరమైన అనుమతులు తెచ్చుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారని, వారికి ఎదురవుతున్న ప్రతిబంధకాలను పరిశీలించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న లీజుల్లో మైనింగ్ ప్రారంభించినట్లయితే అటు ప్రభుత్వానికి రెవెన్యూ లభిస్తుందని, ఇటు పర్యావరణశాఖకు కూడా సిఎఫ్ఓ, సిఎఫ్ఇల ద్వారా ఫీజు రూపంలో ఆదాయం లభిస్తుందని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5146 మైనర్ మినరల్ మైనింగ్ లీజులు ఉన్నాయని తెలిపారు. వీటిల్లో 2276 లీజులకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని అన్నారు. మరో 277 లీజులకు సంబంధించి 133 లీజులకు అనుమతులు పొందే అవకాశం ఉందని, మిగిలిన 144 లీజులకు సంబంధించి అనుమతుల విషయంలో సమస్యలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. నాన్ వర్కింగ్ లీజుల్లో అధికారుల చొరవతో 83 లీజుల్లో మైనింగ్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇదే స్పూర్తితో మిగిలిన లీజుదారులతోనూ సంప్రదించి అన్ని చోట్ల మైనింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం గనులశాఖ నుంచి లైజనింగ్ అధికారులనుకూడా నియమిస్తామని తెలిపారు.

పర్యావరణ అనుమతుల విషయంలో నిర్ధిష్ట కాలవ్యవధిలోనే అన్ని నిబంధనలను పరిశీలించి, అర్హత ఉన్న లీజులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే అటవీశాఖకు సంబంధించిన భూముల్లో మైనింగ్ కోసం వచ్చిన దరఖాస్తుల విషయంలో ప్రత్యామ్నాయంగా పచ్చదనాన్ని పెంచే భూములను కేటాయించడంపై కూడా ఎవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం మైనింగ్ జరుగుతున్న క్వారీల నుంచి వచ్చే వ్యర్థాలను అటవీభూముల్లో వదిలేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యావరణానికి విఘాతం కలిగించే విధానాలను ఎటువంటి స్థితిలోనూ సహించకూడదని, దీనిపై లీజుదారులకు నిర్ధిష్టమైన సూచనలు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో  నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండే టెక్నాలజీ), గోపాలకృష్ణ ద్వివేది, ప్రిన్సిపల్ సెక్రటరీ (మైన్స్), స్టేట్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటర్రామరెడ్డి,  ప్రదీప్ కుమార్ (పిసిసిఎఫ్, హెచ్ ఓ ఎఫ్ ఎఫ్ అటవీశాఖ), విజి వెంకటరెడ్డి, డైరెక్టర్ మైన్స్ & జియాలజీ,  పలువురు అధికారులు పాల్గొన్నారు.

Also Read : గృహాలకు సిమెంట్ ఇవ్వాల్సిందే: మంత్రులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్