Supply Cement: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేరువ చేస్తోందని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేష్ తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు, భారీ ఎత్తున తలపెట్టిన నిర్మాణాలకు అవసరమైన సిమెంట్ ను తమకు నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సిమెంట్ కర్మాగారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలోని మూడోబ్లాక్ లో మంగళవారం వైయస్ఆర్ నిర్మాణ్ లో భాగంగా సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ కార్యక్రమాలకు సిమెంట్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఆయా పరిశ్రమల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రభుత్వంతో చేసుకున్న అవగాహన మేరకు పరిశ్రమలు సిమెంట్ ను అందించాల్సి ఉందని, అయితే కొన్ని కంపెనీలు తమకే నిర్ధేశించిన దానిలో ముప్పైశాతం కూడా అందించలేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ 31 లక్షల మందికి ఇళ్ళస్థలాలు ఇచ్చారని, మొదటి దశలో 16 లక్షల ఇళ్ళ నిర్మాణం ప్రారంభించారని మంత్రులు తెలిపారు. అలాగే ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, విలేజ్ క్లీనిక్స్, బల్క్ మిల్క్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు ఇలా ప్రజలకు మంచి పాలన అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ విభాగాల పక్కా భవనాలు నిర్మాణం జరుగుతోందని, నాడు-నేడు కింద కూడా పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఈ నిర్మాణ పనులకు సిమెంట్ అవసరాలను ఆయా కంపెనీలు తీర్చాల్సి ఉండగా, అనుకున్న మేర సిమెంట్ సరఫరా చేయడం లేదని అన్నారు.

సిమెంట్ కంపెనీల ప్రతినిధులు తమ సమస్యలు ఏవైనా ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, సీఎం గారితో చర్చించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి పరిశ్రమలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. నిర్మాణాలకు అవసరమైన సిమెంట్ విషయంలో కొరత ఏర్పడితే అంతిమంగా ప్రజలకు నష్టం జరుగుతుందని, దానిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. దీనిపై సిమెంట్ కంపెనీల ప్రతినిధులు కూడా మరోసారి సమీక్షించుకోవాలని, తమకు నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సిమెంట్ సరఫరాను సకాలంలో అందించాలని కోరారు. మంత్రుల విజ్ఞప్తిపై సిమెంట్ కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. నిర్ధిష్ట కాలవ్యవధిలోనే సిమెంట్ సరఫరాను పెంచుతామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో గృహనిర్మాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, గృహనిర్మాణ సంస్థ ఎండి నారాయణ్ భరత్ గుప్తా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, గనులశాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : జిల్లాలకు ఇన్-ఛార్జ్ మంత్రుల నియామకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *