Sunday, January 19, 2025
HomeTrending Newsబాబుది తప్పుడు ప్రచారం: అనిల్

బాబుది తప్పుడు ప్రచారం: అనిల్

Babu Comments baseless:
అన్నమయ్య ప్రాజెక్టు సామర్ధ్యం 2.17 లక్షల క్యూసెక్కులు అయితే రెండు మూడు గంటల వ్యవధిలోనే మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కుల వరద వచ్చిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ తెలియజేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో నేడు చంద్రబాబు చేసిన ఆరోపణలను అనిల్ ఖండించారు. ప్రకృతి విపత్తుతో ప్రజలు ప్రాణాలు కోల్పోతే దాన్ని ప్రభుత్వ చేతగానితనంగా చెబుతున్నారని మండిపడ్డారు.

అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో బాబు తప్పుదోవ పట్టిస్తున్నారని,  2017 లోనే కొత్త స్పిల్ వే కట్టాలని డ్యామ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించినా అప్పుడు సిఎంగా ఉంది కూడా పట్టించుకోలేదని విమర్శించారు.  చంద్రబాబు హయాంలో  వర్షాలు లేవని, ఆ సమయంలోనే రిపేర్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. వైఎస్ జగన్ సిఎంగా వచ్చిన తరువాత సమృద్ధిగా వర్షాలు పడి ప్రాజెక్టుల నిండా నీరు ఉందని, ఈ  సమయంలో గేట్లు మార్చాలన్నా ఇబ్బందికరంగా ఉంటుందని అనిల్ వివరించారు.

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను టిడిపి, బిజెపి నేతలు తప్పుదోవ పట్టించారని, కేవలం ఒక్క గేటు వల్లే ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కేంద్రమంత్రి ఎలా చెబుతారని అనిల్ ప్రశ్నించారు.   అధికారులు నిద్రాహారాలు మాని వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారని, ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే పెనుముప్పు తప్పిందన్నారు. ఇన్ని లక్షల క్యూసెక్కుల  ఫ్లడ్ వస్తుందని సిడబ్ల్యూసీ చెప్పలేదని మంత్రి అనిల్ స్పష్టం చేశారు.

సోమశిలకు 140  ఏళ్ళ తరువాత ఇంత పెద్ద వరద వచ్చిందని, ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఏమిటో చెప్పాలని సవాల్ చేశారు. గతంలో ఉత్తరాఖండ్ లో కూడా అకాల వరదలు వచ్చి వందల మంది కొట్టుకు పోయారని, అది ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఒపుకుంటారా అని మంత్రి అడిగారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్