Friday, March 29, 2024
HomeTrending Newsసమ న్యాయం అని రాజ్యాంగమే చెప్పింది: ధర్మాన

సమ న్యాయం అని రాజ్యాంగమే చెప్పింది: ధర్మాన

ఒక రాష్ట్రంలో లభించే వనరులన్నీ ఆ రాష్ట్రం మొత్తం సమంగా పంచాలని రాజ్యాంగం చెబుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో 65 ఏళ్ళపాటు ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీవ్రంగా నష్టపోయామని, మళ్ళీ అదే తప్పు అమరావతిలో జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. అందుకే నాడు హైదరాబాద్ తో కూడిన తెలంగాణను ఇస్తామంటే ఇక్కడి ప్రజలు అభ్యంతరం తెలిపారని, హైదరాబాద్ ను వదులుకోబోమని చెప్పారని… ఈ విషయాన్ని అందరూ ఆలోచించాలని కోరారు.

14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏపీ రాజధాని విషయంలో ఎందుకు ఈ ఆలోచన చేయలేకపోయారని ధర్మాన ప్రశ్నించారు. అమరావతిలో భూములన్నీ తన వారితో కొనుగోలు చేయించి తద్వారా సంపదను చేతుల్లో పెట్టుకోవాలనే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. రాజధాని దొనకొండ అని కొన్నిసార్లు, నూజివీడు అని కొన్నిసార్లు మభ్యపెట్టి చివరకు అంతా అయిన తరువాత అమరావతిని ప్రకటించారని ఆక్షేపించారు.

అమరావతిలో రాజధాని వద్దని సిఎం జగన్ కూడా చెప్పడం లేదని, మూడు ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేసే దిశగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రాజధాని ఉండాలని, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని స్పష్టంగా చెప్పారని ధర్మాన వివరించారు.  మూడు రాజధానుల నిర్ణయం కేంద్ర ప్రభుత్వ కమిటీ చెప్పిన దానికి, రాజ్యాంగానికి, మూడు ప్రాంతాల ప్రజల అభిమతానికి అనుగుణంగా ఉందన్నారు.

విశాఖ పథంలో పరిపాలనా రాజధాని వద్దని ఇక్కడకు వచ్చి చెబితే తాము ఊరుకోవాలా అని ధర్మాన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలను ఇస్తే ఒక్కదాన్ని కూడా శ్రీకాకుళంలో పెట్టలేదని గుర్తుచేశారు.

అమరావతి రైతులకు న్యాయం చేయాల్సిందేనని, దీని విషయంలో మరో ఆలోచనకు తావు లేదని, కానీ రైతుల మాటున ప్రజలందరి రాజ్యంగ హక్కులను హరిస్తామంటే, గడచిన అన్యాయం మరోసారి జరిగితే చూస్తూ ఊరుకోవడానికి తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. రైతులను కావాలనే రెచ్చగొడుతున్నారని, చంద్రబాబు మాయలో వారు పడొద్దని ధర్మాన విజ్ఞప్తి చేశారు.

Also Read : జగన్ పాలనలో బలహీన వర్గాలకు గౌరవం : ధర్మాన

RELATED ARTICLES

Most Popular

న్యూస్