Friday, November 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్పేలుడుపై ఉన్నతస్థాయి విచారణ : పెద్దిరెడ్డి

పేలుడుపై ఉన్నతస్థాయి విచారణ : పెద్దిరెడ్డి

వైయస్‌ఆర్ కడప జిల్లా కలసపాడు మండల, మామిళ్ళ పల్లె గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 1లో జరిగిన బ్లాస్టింగ్ దుర్ఘటనపై గనులు, భూగర్భశాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 5 ప్రభుత్వ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీకి విచారణ బాధ్యతలు అప్పగించారు. కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్, మైన్స్‌ సేఫ్టీ, ఎక్ల్ ప్లోజీవ్స్‌ శాఖలకు చెందిన అధికారులతో ఏర్పాటు చేసిన ఈ విచారణ కమిటీ అయిదు రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుందని మంత్రి తెలిపారు. ఈ బ్లాస్టింగ్ ఘటనలో పదిమంది మృత్యువాత పడటం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేలుడు ఘటనలో మృతిచెందిన వారికి డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధి నుంచి తక్షణం రూ.పది లక్షలు, గాయపడిన వారికి రూ.అయిదు లక్షల పరిహారంను అందచేస్తున్నట్లు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే కడప జిల్లా కలెక్టర్ వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఈ ఘటనపై వచ్చిన వివరాల ప్రకారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందచేశారని తెలిపారు.

లీజు దారు అజాగ్రత్త వల్లనే ఈ ప్రేలుడు సంభవించినదని, లేబర్ డిపార్టుమెంటు నష్ట పరిహర చట్టం 1923 ప్రకారం మృతి చెందిన కూలీల కుటుంబాలకు లీజు దారు నుంచి నష్టపరిహారంను కూడా ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మైనింగ్ నియమావళిని ఉల్లంఘించకుండా లీజుదారులను అప్రమత్తం చేస్తామని తెలిపారు. అలాగే నిబంధనలను పాటించని లీజుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లీజుదారు నిర్లక్ష్యం వల్లే వైయస్‌ఆర్‌ కడప జిల్లాలో ఈ ఈ దుర్ఘటనకు జరిగిందని, దీనిపై ఆంధ్ర ప్రదేశ్ చిన్న తరహా ఖనిజ నియమావళి 1966, MMD&R Act, 1957 ప్రకారం లీజుదారుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్