Saturday, November 23, 2024
HomeTrending Newsఉద్యోగాలు ఊడగొట్టిన పార్టీ బిజేపీ

ఉద్యోగాలు ఊడగొట్టిన పార్టీ బిజేపీ

‘‘ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు, వెక్కిరింతలు చేసిన పథకాలే నేడు తెలంగాణ ప్రజల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. దళితబంధు పథకం కూడా రాష్ట్రమంతటా అద్భుతంగా అమలు జరుగుతుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. ’’ అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేటలోని టీఆర్‌ఎస్‌ పార్టీ భవన్‌లో సోమవారం హుజూరాబాద్‌ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇంచార్జులకు ఎన్నికల ప్రచారంపై దిశానిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు అనగానే బిజేపీ పార్టీ దొంగ డ్రామాలు ప్రారంభిస్తుందని అన్నారు. ప్రచారంలో గాయాలు అయినట్లు, అనారోగ్యానికి గురైనట్లు, ఒళ్లంతా పట్టీలు కట్టుకొని తిరుగుతూ సానుభూతి పొందడం  ఆ పార్టీ ప్రచార ప్రణాళికలో ఓ ఎత్తుగడ అని విమర్శించారు. ఈ ఎత్తుగడలను బెంగాల్‌, తమిళనాడుల్లో బండకు కొట్టి బిజేపీని తరమికొట్టారని మండిపడ్డారు. బిజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని, రేపు హుజూరాబాద్‌లో బిజేపీ గెలిచినా నయాపైసా ఉపయోగం ఉండదన్నారు.  వీరి డ్రామాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని హుజూరాబాద్‌ నేతలకు సూచించారు.

ఉద్యోగాలు ఊడగొట్టిన పార్టీ బిజేపీ..

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తూ ఉద్యోగాలను ఊడగొడుతున్న పార్టీ బిజేపీ అని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలో సగం మందిని తొలగించారని అన్నారు. అన్నింటిని ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు ఎలా అమలవుతాయని ప్రశ్నించారు. బిజేపీ పార్టీ ఉద్యోగాలు ఊడగొడుతుంటే .. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తున్నదని, ఇప్పటివరకు 1.32లక్షల ఉద్యోగాలు కల్పించిందని.. త్వరలోనే 50 నుంచి 70వేల ఉద్యోగాల భర్తీపై చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వ రంగసంస్థలను అమ్మడానికి సపరేటుగా ఓ శాఖను ఏర్పాటు చేసిన బిజేపీ ప్రభుత్వంలో బిసీ ల కోసం ఓ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని అడిగారు.

భారీ మెజార్టీతో కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలి..

2001లో  టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం అయిన రోజుల్లోనే హుజూరాబాద్‌ నియోజకవర్గమంతా కేసీఆర్‌ వెంట ఉందని  మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. నాడు జరిగిన ఎన్నికల్లో అన్నిచోట్లా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచారని చెప్పారు. నాడు ఈటల రాజేందర్‌ ఓ వ్యక్తిలా వచ్చి.. ఇప్పుడు ఓ వ్యక్తిలా వెళ్లిపోయాడే తప్ప పార్టీ మొత్తం కేసీఆర్‌ వైపే ఉన్నదని అన్నారు. ఈటలకు టీఆర్‌ఎస్‌ పార్టీలో అత్యంత ప్రాధాన్యత దక్కిందన్నారు. కానీ ఆయనే తల్లిలాంటి పార్టీకి అన్యాయం చేయడానికి సిద్దమయ్యారని ఆరోపించారు. అందుకే హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతీ టీఆర్‌ఎస్‌ కార్యకర్తకు ఈ గెలుపు ప్రతిష్టను, గౌరవాన్ని తెచ్చిపెడుతుందన్నారు. బిజేపీ పార్టీ మాదిరిగా లేనిది ఉన్నట్లు చెప్పకుండా.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన పనులనే ప్రజలకు చెప్పాలని దిశానిర్ధేశం చేశారు. భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని సూచించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ గెలుపునూ ఎవ్వరూ ఆపలేరన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, ఎస్సీ కార్పోరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, సిద్దిపేట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌ పర్సన్‌ కొలిపాక నిర్మల, హుజూరాబాద్‌ జడ్పీటీసీ సభ్యుడు బక్కారెడ్డి, ఎంపీపీ ఈరుమల్ల రాణి, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, బిసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొండాల్‌రెడ్డి, సిద్దిపేట మార్కెట్‌ చైర్మన్‌ పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్