Cycle Ride: ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్.సీ.సీ, నిర్మల్ సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్డేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మంచిర్యాల చౌరస్తా- చించోలి క్రాస్ రోడ్ – హరితవనం- ఎన్టీఆర్ స్టేడియం వరకు కొనసాగింది. 15.5 కిలోమీటర్ల ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉత్సహంగా పాల్గొని సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శారీరకంగా దృఢంగా ఉండేందుకు సైకిల్ ప్రయాణం ఉపయోగ పడుతుందన్నారు.
సైకిల్.. రవాణాకు ఉపయోగకరమే కాకుండా, ఇంధన ఆదాకు ఉపయుక్తమైనదని చెప్పారు. వీలైనంత వరకూ సైకిల్‌పై వెళ్లేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని కోరారు. కాలుష్యం తగ్గించడానికి వాహనాల వినియోగం తగ్గించాలని పిలపునిచ్చారు. అందుకు సైక్లింగ్ వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చిన్న వయసు నుంచే పిల్లలకు సైక్లింగ్ చేయడం అలవాటు చేసి వారిని ప్రొత్సహించాలని సూచించారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం (World Bicycle Day) సందర్భంగా.. సైకిల్ అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ సైకిల్ క్లబ్ లో సభ్యుల సంఖ్య మరింత పెరగాలని అభిలాషించారు. ఈ కార్యక్రమ నిర్వహకులు డా. రామకృష్ణతో పాటు సైకిల్ క్లబ్ మెంబర్స్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కె.విజయలక్ష్మి రెడ్డి, కలెక్టర్ ముశ్రఫ్ ఫారూఖీ అలీ, తదితరులు పాల్గొన్నారు.