నిరుపేదలకు పెండ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మీ పథకాన్ని రూపొందించారని. బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ పథకాల లబ్దిదారులకు ఈరోజు కరీంనగరంలో లబ్దిదారులకు చెక్కులను అందించారు. 313 మంది లబ్ధిదారులకు 3 కోట్ల విలువచేసే చెక్కులను అందించారు. అర్హులైన ప్రతి కుటుంబం కుల, మత భేదం లేకుండా ఈ పథకం ద్వారా లభ్దిపొందుతున్నారన్నారు.
ఎన్నో నిరుపేద కుటుంబాల్లో ఈ పథకం నవ్వులు పూయిస్తుందన్న మంత్రి ఆడబిడ్డ పెళ్లిని సగర్వంగా చేసి ఆత్మాభిమానానికి అండగా నిలుస్తుందన్నారు, అప్పుల్లో కూరుకుపోయి ఆస్థులమ్ముకునే గతానికి ముఖ్యమంత్రి ఆలోచనల ద్వారా పురుడుపోసుకున్న కళ్యాణ లక్ష్మి పథకం చరమగీతం పాడిందన్నారు.
మొదటగా 50 వేలు, తదనంతరం 75 వేలు ప్రస్తుతం లక్ష రూపాయలు ఈ పథకం కింద ప్రభుత్వం అందిస్తోందని, ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టాలేదని మంత్రి గుర్తు చేశారు. త్వరలోనే పెండ్లి సమయంలో పెండ్లి మండపంలోనే కళ్యాణలక్ష్మీ చెక్కు అందేలా చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు.