తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. జర్మనీలోని బెర్లిన్ లో జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్ -2023 సదస్సుకి హాజరుకావాలని మంత్రి కేటీఆర్ కి నిర్వాహకులు ఆహ్వానాన్ని అందించారు. ఈ సమావేశం జూన్ 12 నుంచి 15 వరకు జర్మనీలోని నగరంలో జరుగుతుంది. కనెక్టింగ్ స్టార్ట్ అప్ ఈకో సిస్టం అనే అంశంపైన ఈ సమావేశం జరుగుతుందని, ఈ సదస్సుకు హాజరు అయి, ప్రసంగించాలని మంత్రి కేటీఆర్ కి ఆహ్వానం అందింది.
జర్మనీకి సెనెట్ చెందిన ఎకనామిక్స్, ఎనర్జీ, మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజ్ శాఖ మంత్రి కేటీఆర్ కి ఆహ్వానం పంపింది. ఈ సదస్సులో ప్రసంగించడం ద్వారా భారత్ తో పాటు తెలంగాణ మరియు ఇతర దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ప్రయత్నాలను బలోపేతం చేయాలని కోరింది. ప్రతి ఏటా ఈ సదస్సు ద్వారా జర్మనీ మరియు అసియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను, భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు నిర్వహిస్తారు. ముఖ్యంగా జర్మనీలో ఉన్న స్టార్ట్ అప్ లను అసియా ఖండంలోని మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ సంవత్సరం జరగనున్న సదస్సు మొబిలిటీ, లాజిస్టిక్స్, ఎనర్జీ, గ్రీన్ టెక్, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రధానమైన అంశాలను విస్తృతంగా చర్చిస్తుందని తెలిపారు. దీంతోపాటు ఈ సమావేశంలో భాగంగా పెట్టుబడిదారులకు ప్రత్యేకమైన సెషన్ ఉంటుందని, అద్భుతమైన ఐడియాలున్న స్టార్ట్ అప్ కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. జర్మనీలో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం బలాన్ని అసియా ఖండంలోని స్టార్ట్ అప్ లతో పంచుకునేందుకు ఈ సదస్సు ఎంతగానో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు మంత్రి కేటీఆర్ కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.