Unfair allegations: రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. రిషికొండలో ప్రభుత్వ అనుమతి మేరకే తవ్వకాలు జరుగుతున్నాయని, ఆ కంపెనీ వారు 6 కోట్ల రూపాయల వరకూ రాయల్టీ కూడా ప్రభుత్వానికి చెల్లించారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత రిషికొండలో ఎలాంటి అక్రమాలూ జరగలేనేదన్నారు. కుప్పంలో తన అనుచరుడు, మాజీ ఎమ్మెల్సీ గౌరిగాని శ్రీనివాసులు మైనింగ్ చేసే క్వారీ వద్దకే చంద్రబాబు వెళ్ళారని, అక్కడ ఎవరు రౌడీయిజం చేస్తారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు చౌకబారు ఆరోపణలతో, ఏవేవో ఫోటోలు పెట్టి ఎగ్జిబిషన్ కూడా పెట్టారని మండిపడ్డారు. నిన్న బాబు చేసిన ఆరోపణలపై నేడు తిరుపతిలో పెద్దిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
మైనింగ్ లో ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే అవి చంద్రబాబు హయాంలోనే జరిగాయని, ఫారెస్ట్ ఏరియాలో కూడా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పంలో కేవలం రెండు చోట్ల మాత్రమే మైనింగ్ లీజులు ఇచ్చామని తెలిపారు. లీజు పరిధి దాటి మైన్ చేసినందుకు ఈ రెండు కంపెనీలకు ఫైన్ కూడా వేశామన్నారు. కుప్పంలో మొత్తం 102 మైనింగ్ లీజులు ఉంతే వాటిలో 71 మండి లీజుదారులకు నోటీసులు ఇచ్చి నిలుపుదల చేశామని, ఇప్పుడు 31మాత్రమే నడుస్తున్నాయని, వీటికి ఎవరి హయాంలో అనుమతులు వచ్చాయో తెలుసుకోవాలని సూచించారు. టెక్నాలజీ పెరిగిన తరువాత శాటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అక్రమంగా మైనింగ్ చేస్తే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భారతి సిమెంట్స్ కోసం వెయ్యి లారీల లాటరైట్ తవ్వుతున్నారని బాబు ఆరోపించడాన్ని కూడా పెద్దిరెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. సిమెంట్ ప్రొడక్షన్ లో కేవలంమూడు శాతం మాత్రమే లాటరైట్ వాడతారని, దానికోసం రోజూ వెయ్యి లారీలు అని చెప్పడం అర్ధంలేని ఆరోపణ అన్నారు.
మైనింగ్ సక్రమంగా చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని, గత వారమే కేంద్ర హెం మంత్రి అమిత్ షా, ప్రహ్లాద్ జోషి లు తమకు 1.8 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా ఇచ్చారని పెద్దిరెడ్డి వెల్లడించారు. గత ఏడాది కూడా 60 లక్షల రూపాయల అవార్డు గెల్చుకున్నామని వివరించారు.