హైదరాబాద్ లో నివాసముంటున్న పవన్ కళ్యాణ్ తను శ్వాస తీసుకోవాలో వద్దో అడగాల్సింది తమ పార్టీని కాదని, కెసిఆర్, కేటిఆర్ లను అని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. ఆయన ప్రచారరథం రంగుపై తమకు ఎలాంటి ఆసక్తీ లేదని, ఫోటో షేర్ చేసిన తర్వాత దానిపై మీడియా పలు రకాల వార్తలు ప్రసారం చేసిందన్నారు. రవాణా శాఖా మంత్రి పని చేసిన పేర్నినానిని కొందరు మీడియా ప్రతినిధులు అడిగితేనే దానిపై స్పందించారని అన్నారు. తిరుపతిలో రోజా మీడియాతో మాట్లాడారు.
పవన్ అసలు ఎందుకు ట్వీట్స్ చేస్తున్నారో, ఏమి చెప్పదలచుకున్నారో, దానిపై మీడియా తమను ఎందుకు అడుగుతుందో ఏమీ అర్ధం కావడం లేదన్నారు. తాము ఏదైనా స్పందిస్తే పవన్ ను తొక్కేస్తున్నారని అంటారని, చెప్పకపోతే భయపడి మాట్లాడడంలేదని అంటారని ఎద్దేవా చేశారు. యుద్ధానికి సిద్ధం అంటూ పవన్ చేసిన కామెంట్ పై కూడా రోజా స్పందించారు. తమ నేత జగన్ ఎప్పుడూ యుద్ధానికి రెడీగా ఉంటారని, మొత్తం 175 సీట్లలో తమకు అభ్యర్ధులు ఉన్నారని, పవన్ కు కూడా అన్ని సీట్లలో పోటీ చేసే ధైర్యం ఉందా అంటూ సవాల్ చేశారు. ఎవడి సైన్యంలోనో రి దొంగదెబ్బ తీయాలని అనుకుంటే ఇక్కడ ఎవరూ భయపడేవారు లేరని స్పష్టం చేశారు.
విశాఖ గర్జన రోజే పవన్ కళ్యాణ్ పర్యటన పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని, జన సేన కార్యకర్తలు పవన్ ను రిసీవ్ చేసుకోవాలంటే అరైవల్ లో ఉండాలి కానీ, డిపార్చర్ బ్లాక్ లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. కరకట్టపై చంద్రబాబుకు ఇల్లు ఇచ్చిన లింగమనేని పవన్ కు కూడా పార్టీ ఆఫీస్ కు స్థలం ఇచ్చారని, తాము ఏమైనా అడ్డు పడ్డామా అని రోజా నిలదీశారు. తాము పాలనపై దృష్టి పెట్టామని, ఇలాంటి అంశాలపై ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.