Tributes to Alluri: మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు చైతన్య స్పూర్తితో రాష్ట్ర అభివృద్ధికి సిఎం జగన్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి ఆర్.కె.రోజా అన్నారు. పుత్తూరులోని సాయిబాబా గుడి ఆర్చ్ పక్కన ఏర్పాటుచేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజుతో కలసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడారు. అల్లూరి ఆశయాలను నెరవేరుస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రజలకు విద్య వైద్యం అందించి వారి అభివృద్ధికి సిఎం జగన్ బాటలు వేస్తున్నారని రోజా తెలిపారు. ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో ఒక జిల్లాకి అల్లూరి సీతారామరాజు పేరు కూడా పెట్టారని గుర్తు చేశారు.
అల్లూరి సీతారామరాజు స్మృతులతో 22 ఎకరాలలో ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా వైజాగ్ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఆ కాలంలోనే 40 లక్షల రూపాయలు ఖర్చు చేసిందని, 2,500 మంది సైనికులను నియమించిందని, అయినా సరే వాళ్ళ వల్ల కాలేదని, తనకోసం అమాయక గిరిజనులను రాచిరంపాన పెడుతుంటే, తనవల్ల వారికి కష్టాలు రాకూడదని ఆయన స్వయంగా లొంగిపోయారని రోజా వివరించారు.
జూలై 4వ తేదీన ఆయన జయంతి సందర్భంగా జూన్ 28 నుంచి జూలై 4వరకూ వారం రోజులపాటు జన్మదిన వేడుకలు జరుపుతున్నామన్నారు. నగిరి నియోజకవర్గంలో అల్లూరి విగ్రహవిష్కరణ చేసే అదృష్టం దక్కినందుకు రోజా సంతోషం వ్యక్తం చేశారు, అయన జీవించింది 27 ఏళ్ళు మాత్రమే అయినా తరాలపాటు గుర్తుపెట్టుకునే విధంగా జీవించారని కొనియాడారు. ఆయన పుట్టిన ఈ నేలమీద మనమందరం ఉండటం మనందరి అదృష్టమని అభివర్ణించారు రోజా.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలను, చైతన్య స్పూర్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపు ఇచ్చారు. వడమాలపేట మండలం పూడి క్రాస్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. పుత్తూరులో పురాతన అడ్డ కత్తి వేషధారణలతో కత్తులు ఝళిపిస్తుంఢగా, కేరళ డ్రమ్ము వాయిద్యాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం, బుర్రకథ , చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.