బ్రహ్మంగారి మఠం వివాదం పరిష్కారానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో అయన పర్యటిస్తున్నారు. మఠాధిపతి ఎంపికపై గత రెండునెలలుగా కుటుంబ సభ్యుల మధ్య వివాదం చెలరేగుతోంది. ఇటీవల మరణించిన మఠాధిపతి వెంకటేశ్వర స్వామి మొదటి భార్య, రెండవ భార్య సంతానం తమకే బాధ్యతలు దక్కాలని పట్టుబడుతున్నారు. దీనిపై పలువురు పీఠాధిపతులు వచ్చి సయోధ్యకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది.
పీఠాధిపతులంతా మొదటి భార్య కుమారుడికే మఠం బాధ్యతలు అప్పగించాలని సూచిస్తున్నారు. కానీ రెండో భార్య ఈ ప్రతిపాదనకు ససేమిరా అంటోంది. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ ప్రభుత్వం తరఫున కడప దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ను ఫిట్ పర్సన్ గా నియమించారు.
ఈ నేపథ్యంలో నేడు మఠానికి రానున్న మంత్రి వెల్లంపల్లి బ్రహంగారి కుటుంబ వారసులతో పాటు గ్రామస్థులతో కూడా చర్చలు జరుపుతారు. అనంతరం ప్రభుత్వం పెద్దలతో చర్చించి తుది నిర్ణయం ప్రకతించే అవకాశం ఉంది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ శ్రీశైలంలో పర్యటిస్తున్నారు, ఆయనకు స్వాగతం పలికేందుకు వెల్లంపల్లి శ్రీశైలం చేరుకున్నారు. జస్టిస్ రమణ పర్యటన ముగిసిన తరువాత వెల్లంపల్లి నేరుగా బ్రహంగారి మఠానికి చేరుకుంటారు.