గుత్తికోయలదాడిలో మరణించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం ఈర్లపూడిలో జరిగాయి, రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే రేగా కాంతారావులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించారు. ఎంపీ వద్దిరాజు ఆయన మృతుడి కుటుంబానికి వ్యక్తిగతంగా 2లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించారు.
కాగా, అటవీ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ విధానం వల్లే ఈ తరహా ఘటనలు, దాడులు జరుగుతున్నాయని, పోడు భూముల వ్యవహారాన్ని తెల్చకపోవడమే కారణమని ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోడు సాగును ఆడ్డుకొని, అటవీ సంపదను పరిరక్షించాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటించడమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న సిబ్బంది మంత్రులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు, ప్రభుత్వ విధానంపై నిలదీశారు. ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని, దోషులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.
కాగా, ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య కేసుతో సంబంధం ఉన్న ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ వినీత్ పరిశీలించారు.
Also Read : అటవీ అధికారి మృతిపై సిఎం దిగ్భ్రాంతి