ఆరు నూరైనా.. నూరు ఆరైనా మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్స్ ఉండి తీరాల్సిందేనని, ఇది జగన్ మాట, వైఎస్సార్ బిడ్డ మాట అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. ముస్లిం రిజర్వేషన్స్ తొలగిస్తామని చెబుతున్న బిజెపితో చంద్రబాబు జతకట్టారని, ఆయన అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్స్ కొనసాగిస్తామని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్స్ కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చినవి కాదని, వెనుకబాటుతనం ప్రాతిపదికతో ఇచ్చినవని వెల్లడించారు. ముస్లింలలో ఉన్న ఉన్నత వర్గాలైన పఠాన్, సయ్యద్, మొఘల్ లకు వర్తించడంలేదని, అన్ని మతాల్లో బిసిలు, ఒసీలు ఉంటారని.. అలాంటప్పుడు మైనార్టీలను వేరుగా చూడడం.. రాజకీయ స్వార్ధం కోసం వారి నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. మైనార్టీ రిజర్వేషన్స్, ఎన్నార్సీ, సీఏఏ లాంటి విషయాల్లో మైనార్టీల మనోభావాలకు, వారి ఇజ్జత్ కు అండగా.. వారి పక్షానే ఉంటామని ప్రకటించారు. కర్నూలులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగించారు.
ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడంతో పాటు నలుగురికి ఎమ్మెల్సీలు ఇచ్చామని, నలుగురికి ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామని, డిప్యూటీ సిఎం ఇచ్చామని, శాసనమండలి ఉపాధ్యక్షురాలిగా ఇచ్చామని.. వారికి సముచిత స్థానం ఇచ్చామని వివరించారు. చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలపై ఎప్పుడూ ప్రేమ లేదని, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అలవాటులేదని… ఆయన చేసేవన్నీ ఊసరవెల్లి రాజకీయాలని, బాగా ముదిరిపోయిన తొండ అని ధ్వజమెత్తారు. మైనార్టీలపై బాబు దొంగ ప్రేమను కనబరుస్తున్నారన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్స్ రాజకీయంగా కూడా ఇచ్చామని, మొత్తం 175 సీట్లలో ఏడుగురికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చామన్నారు.