తండ్రీ కూతుళ్ల బంధానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా తండ్రిపైనే కూతురికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఆమె దృష్టిలో అతనే హీరో. అలాగే తన కూతురు కన్నీళ్లు పెట్టనంత వరకే ఏ తండ్రి అయినా ఎంతటి సహనమైనా చూపుతాడు. తన కూతురు బాధపడుతుందంటే ఎంతకి తెగించడానికైనా వెనుకాడడు. అలాంటి ఒక తండ్రి కథనే ‘మిషన్ – చాప్టర్ 1’. విజయ్ దర్శకత్వంలో అరుణ్ విజయ్ హీరోగా ఈ సినిమా రూపొందింది.
తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఆ మధ్య వచ్చిన కార్తి ‘ఖైదీ’ సినిమాకి ప్రేక్షకులు భారీ హిట్ ను అప్పగించారు. జైలు నుంచి విడుదలైన ఒక తండ్రి తన కూతురును కలుసుకోవడానికి బయల్దేరతాడు. మార్గ మధ్యంలో అతనికి అనుకోని అవాంతరం ఎదురవుతుంది. తన కూతురు దగ్గరికి చేరుకోవడం కోసం అతను తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడనేది కథ. ఒక రాత్రిలో జరిగే ఈ కథ కాసుల వర్షాన్ని కురిపించింది.
ఇక ‘మిషన్ – చాప్టర్ 1 ‘ సినిమా విషయానికి వస్తే, హీరో తన కూతురుకి రెండు రోజుల్లో ఒక కీలకమైన ఆపరేషన్ చేయించాలి. కానీ ఊహించని విధంగా అతను లండన్ జైలులో ఖైదీగా చిక్కుకుంటాడు. తన కూతురు ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆ తండ్రి ఏం చేశాడు? అనేదే కథ. కార్తి ‘ఖైదీ’ సినిమాలో హీరో జైలు నుంచి విడుదలైన తరువాత అసలు కథ మొదలవుతుంది. అరుణ్ సినిమాలో హీరో జైలుకి వెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది. చూడాలి మరి లైకా నుంచి వస్తున్న ఈ భారీ సినిమా ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో.
Also Read : Daggubati Abhiram: ‘అహింస’ రిలీజ్ విషయంలో ఎందుకింత ఆలస్యం?