మిజోరం రాష్ట్రంలోని 6వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. క్షతగాత్రుల్లో కొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 11కు చేరింది. గత నెల 29న 22 వేల లీటర్ల పెట్రోల్‌తో వెళ్తున్న ట్యాంకర్ మిజోరం రాష్ట్రం ఐజ్వాల్ జిల్లాలోని తురియల్ ఎయిర్‌ఫీల్డ్ వద్ద ప్రమాదానికి గురైంది.
దాంతో పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ట్యాంకర్‌లోని పెట్రోల్ కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెట్రోల్‌కు మంటలు అంటుకోవడంతో ఘోరం జరిగింది. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మందికి కాలిన గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే క్షతగాత్రుల్లోని మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మృతుల సంఖ్య 11కు చేరిందని మిజోరం పోలీసులు వెల్లడించారు.
మరోవైపు మిజోరాంలోని హ్నతియాల్ దగ్గర రాతి క్వారీ కూలిపోయిన ఘటనలో మరో మూడు మృతదేహాలు లభ్యం అయ్యాయి. నిన్న ఎనిమిది మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిజోరంలోని హ్నాథియల్ జిల్లాలో సోమవారం ఓ రాతి క్వారీ కూలిపోవడంతో దాని కింద 13 మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు స్వల్ప గాయాలతో బయట పడగా… మరో ఇద్దరి ఆచూకి తెలియాల్సి ఉంది.
Also Read : మిజోరం క్వారీ ఘటనలో 8 మృతదేహాలు లభ్యం