కరోన వాక్సినేషన్ లో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి గా విఫలం అయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ బాధ్యత రాష్ట్రాలపై వదిలేయడంతో వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేక పోయిందని విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో జరిగిన జూమ్ మీటింగ్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ త్వరితగతిన పూర్తి చేసి, అందరికి అందేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా కార్యాచరణ సిద్ధం చెయాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ముఖ్యంగా మరో నాలుగు నెలల్లో థర్డ్ వేవ్ ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో అంతకు ముందుగానే జూన్, జులై, ఆగస్టు నెలల్లోనే అందరికి వ్యాక్సిన్ అందేలా ప్రభుత్వాలపై ఒత్తిడికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాలన్నారు.
దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనాకు ఉచితంగా చికిత్సలు అందిస్తున్నాయని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అలాంటి చర్యలు నేటికీ చేపట్టడం లేదని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంకుశ వైఖరితో నిరుపేద కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకొని చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదనగా వివరించారు. ఎవరి ఖర్మ వారిది అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు.
కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీ లో చేర్చి ప్రజలందరికి ఉచిత శస్త్ర చికిత్సలు అందించాలన్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వ్యక్తుల ఖర్చులను రియాంబర్స్ రూపంలో ప్రభుత్వం విడుదల చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.