Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమోడి మూడో మాస్క్!

మోడి మూడో మాస్క్!

మోడీ ఎందుకు మారాడు?
మోడీ మొదటి సారి సరిదిద్దుకున్నాడు..
మోడీ మొదటి సారి ఒకరు చెప్తే విన్నాడు.
మోడీ మొదటి సారి తన దారిలో వెనక్కి తిరిగాడు..
ఇదంతా కొద్దిరోజులుగా వినపడుతున్న మాటలు.
మేం చెప్పిందే మోడీ విన్నాడని సంతోషపడుతున్న వాళ్ళు కొందరు..
కాదు.. ఇది జనవిజయం అని విశ్లేషిస్తున్న వాళ్లు కొందరు…
నిజంగా జనచైతన్యం ఒకటుందా..
జనం తల్చుకుంటే ప్రభుత్వాలు తలకిందులవుతాయి.
నియంతలు నేలమట్టమవుతారు
మీడియాలో. మేథావుల చర్చల్లో ఇలాంటి మాటలే వినిపిస్తాయి.
ఇవి చూసి బహుశా మోడీ నవ్వుకుంటాడు..
మోడీ లెక్కల్లో..
ఒక్కపుల్వామాతో ప్రజాభిప్రాయం మారిపోతుంది..
ఒక్క గాల్వాన్ తో జనచైతన్యం దారికొస్తుంది.
అయోధ్య, కాశ్మీర్ వుండనేవున్నాయి.
మోడీ టెక్నిక్ చాలా సింపుల్..
జనాన్ని వాళ్ళ చైతన్యాన్ని ముక్కలు ముక్కలు ముక్కలు చేయాలి.
పెద్దముక్కని మనదగ్గర వుంచుకోవాలి.
పాతికేళ్లుగా ఇదే టెక్నిక్ మోడీని అధికారపీఠంపై కూర్చోపెడుతోంది..
గుజరాత్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే తారకమంత్రం.
గోద్రా అల్లర్ల నుంచి లాక్ డౌన్ వరకు ..
ఎన్ని జీవితాలు బుగ్గిపాలైనా…
ఎంతగా మీడియాలో తిట్టిపోసినా..
మోడీకి ఎదురేలేదు.
ఏ ఎన్నికల్లోనూ మోడీకి అపజయం లేదు.
ప్రజాస్వామ్యం నాలుగుస్తంభాలనీ మంచం కోళ్లుగా మార్చి
దాని మీద కాలుమీద కాలేసుకునే పడుకునే దర్జా .. మోడీది….
కానీ – ఏ టెక్నిక్ కి అయినా ఎక్సపైరీ డేట్ వుంటుంది..
ఇప్పుడు మోడీ టెక్నిక్ లకు కూడా కాలం చెల్లుతున్నట్టే ఉంది.
రాజస్థాన్..మహరాష్ట్ర, ఢిల్లీ..బెంగాల్..తమిళనాడు, కేరళ,
వరస ఎన్నికల్లో పరాజయయాత్ర…..
వచ్చే యుపి, పంజాబ్ ఎన్నికల్లో కూడా ఆశలు అంతంతమాత్రమే..
అందుకే మోడీ రూటు మార్చాడు..
అందరూ అనుకుంటున్నట్టు మోడీ రివర్స్ గేర్ వ్యాక్సిన్ తో మొదలవలేదు..
ఎన్నో ప్రగల్భాలు పలికిన సి ఏ ఏ ఏమైంది..
రైతు చట్టాలు ఎందుకు కోర్టు వెనక దాక్కున్నాయి..
కార్మికసంస్కరణలు కోల్డ్ స్టోరేజిలో ఎందుకున్నాయి…
జమిలీ ఎన్నికలను ఎందుకు జాడీలో దాచేసాడు..
లాక్ డౌన్ నిర్ణయాలను రాష్ట్రాలకు ఎందుకు వదిలేసారు….
ఇప్పుడు మాట నెగ్గడం కంటే..
రేపు ఎన్నికల్లో గెలవడం ముఖ్యమనుకున్నాడు.
ఇప్పుడు అహంకారం కంటే, రేపు అధికారమే ముఖ్యమనుకున్నాడు.
రైతు చట్టమైనా, పౌరచట్టమైనా..
మోడీకి చట్టాలు ముఖ్యం కాదు..
ఎన్నికలే ముఖ్యం.
లాక్ డౌన్ అయినా, వ్యాక్సిన్ అయినా..
మోడీకి పట్టుదలముఖ్యం కాదు..పదవే ముఖ్యం.
ఇప్పటి దాకా అంతా నేనే చేసా అనేవాడు…
ఇప్పుడు అంతా మీరు చెప్పినట్టేచేస్తున్నా అంటున్నాడు..
ఇప్పటిదాకా తలెగరేసి గెలిచాడు..
ఇప్పుడు తలవంచుకుని గెలుద్దామనుకుంటున్నాడు.
ఇప్పటి దాకా హీరోలా గెలిచాడు..
ఇప్పుడు విక్టిమ్ రోల్ ప్లే చేస్తున్నాడు.
ఈ మారిన వ్యూహానికి జనం పడిపోతారని మోడీ ఆశ…
మోడీ అహంకారాన్ని నేలకు దించిన జనమే..
అధికారం నుంచి కూడా దించేస్తారని ప్రతిపక్షం అంచనా..
జనం గెలవాలని కోరుకోవడం తప్ప మనం మాత్రం ఏంచేయగలం?

-కే. శివప్రసాద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్