మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్న విషయం తెలిసిందే. మా ఎన్నికలు క్లైమాక్స్ సీన్ కి వచ్చేసాయి. ఇంకొన్ని గంటల్లో మా పోలింగ్ ప్రారంభం కానుంది. అందుచేత చివరి నిమిషం వరకు తమ ప్రయత్నాలు చేస్తూ.. ఎన్నికల బరిలో నువ్వా..? నేనా..? అన్నట్టుగా పోటీపడుతున్నారు. ఎలక్షన్ హీట్ పెంచేస్తున్నారు. రేపు 10న మా ఎన్నికలు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ “47 సంవత్సరాలుగా నటుడుగా, నిర్మాతగా మీరందరూ ఆశీర్వదిస్తున్న మీ మోహన్ బాబు చెప్పేది ఏంటంటే.. తెలుగు నటీనటులు అందరూ ఒకటిగా ఉందామని, అతిరథమహారధులు పెట్టినటువంటిది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఎలక్షన్స్ లేకుండా ఏకగ్రీవంగా వెళదామని.. అప్పటి పెద్దలు కోరకునేవారు కానీ.. ఇప్పుడు కొంత మంది సభ్యులు బజారునపడి నవ్వులపాలవుతున్నారు. మనసుకు కష్టంగా ఉంది. ఎవరు ఎన్ని చేసినా ‘మా’ ఒక కుటుంబం. మీ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. కానీ ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటు వేయండి. మీ అమూల్యమైన ఓటు మా అధ్యక్షుడుగా పోటీ చేస్తున్న నా బిడ్డ మంచు విష్ణు మీ కుటుంబ సభ్యుడు. మంచు విష్ణు మరియు అతని ప్యానల్ కు మీ ఓటు వేసి అత్యథిక మెజార్టీతో గెలిపించండి. మ్యానిఫెస్టోలో తను ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాడని నమ్మకం నాకు ఉంది. విష్ణు అతని ప్యానల్ గెలిచిన వెంటనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి మన కష్టసుఖాలను చెప్పుకుని సహాయ సహకారాలను తీసుకుందాం. బిడ్డను ఆశీర్వదించండి” అన్నారు.