Sunday, January 19, 2025
HomeTrending Newsనైతికత మీదే మీడియా నడవాలి: వెంకయ్య

నైతికత మీదే మీడియా నడవాలి: వెంకయ్య

Media & Morals: మీడియా అనేది అద్దం లాంటిదని అది సమాజాన్ని ప్రతిబింబించడంతో పాటుగా సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేయాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు  సూచించారు. ప్రస్తుత వేగవంతమైన సమాచార యుగంలో మాట పెదవి దాటే లోపు, సమాచారం  పృథ్వి దాటుతోందని,  అందుకే ఇచ్చే సమాచారం సరైనదా కాదా అనేది ఎప్పటికప్పుడు సరి చూసుకోవలసిన అవసరం ఉందని హితవు పలికారు. ఎన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఈ దిశగా స్వీయ నియంత్రణతో పనిచేస్తున్నాయనేది ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

బుధవారం నెల్లూరు జిల్లాకేంద్రంలోని నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం, 100 మీటర్ల 10 కిలోవాట్ల ఎఫ్ఎం స్టేషన్ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విక్రమ సింహపురికి, ఆకాశవాణికి 6 దశాబ్దాలుగా ఉన్న అవినాభావ సంబంధాన్ని, ఇక్కడి ప్రజల జీవితాల్లో రేడియో పాత్రను ప్రస్తావిస్తూ మీడియాకు పలు సూచనలు చేశారు. ప్రచార, ప్రసార మాధ్యమాలు అందించే వార్తలు సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండేలా చూసుకోవాలన్నారు.

మీడియా స్వేచ్ఛ గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉందని ఇలాంటి చర్చ జరుగుతూనే ఉండాలని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. పత్రికా స్వేచ్ఛ ద్వారానే సమాజం, ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందన్నారు. అయితే ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసే వారి విషయంలో మాత్రం ప్రజలు కఠినంగా వ్యవహరించే పరిస్థితి రావాలని ఆయన ఉద్బోధించారు.  మాధ్యమాల్లో, మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల్లో నిజానిజాలు తేల్చడానికి ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఒక నిజనిర్ధారణ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి రావడం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తుందన్నారు. ఇలాంటి వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమాచారం నిజమైనదా కాదా అనేది తెలుసుకోకుండా అందరికీ చేరవేయడం వల్ల సమాజం భయాందోళనలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.

నైతికత పునాదుల మీద జర్నలిజం భవిష్యత్తు ముందు సాగాలని ఆకాంక్షించే వారిలో తాను మొదటివరుసలో ఉంటానన్న ఉపరాష్ట్రపతి,  అలాంటి జర్నలిజానికి ప్రజలు సైతం ప్రోత్సాహం అందించాలన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, వ్యవసాయం వంటి వాటికి పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాలు మరింత ప్రాధాన్యత కల్పించాలన్నారు.

ఆకాశవాణికి, నెల్లూరు జిల్లాకు ఆరు దశాబ్ధాలు అవినాభావ సంబంధం ఉందని, తాను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉండగా నెల్లూరు ఎఫ్.ఎం. శంకుస్థాపన జరగడం, అది పూర్తి స్థాయి రేడియో కేంద్రంగా రూపుదిద్దుకోవడం, ఇప్పుడు దాన్ని జాతికి అంకితం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రసార భారతి సి.ఈ.వో. శశిశేఖర్ వెంపటి, ఆకాశవాణి డైరక్టర్ జనరల్ ఎన్.వేణుధర్ రెడ్డి, అదనపు డైరక్టర్ జనరల్ వి.రమాకాంత్, చెన్నై డిప్యూటీ డైరక్టర్ జనరల్ ఆనందన్, ఇంజనీరింగ్ విభాగ డైరక్టర్ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Also Read : 

మేనిఫెస్టోకు చట్టబద్ధతపై చర్చ జరగాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్