గుజరాత్‌లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగల వంతెన మరమ్మతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్రిడ్జి ఆధునీకరణకు ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించగా.. నిర్వహణ సంస్థ అయిన ఒరేవా గ్రూప్ అందులో రూ.12 లక్షలు మాత్రమే ఖర్చుచేసినట్లు తెలుస్తున్నది. అంటే కేటాయించిన మొత్తంలో కేవలం 6 శాతం నిధులను వినియోగించిందని విచారణలో వెల్లడైంది. తూతూ మంత్రంగా పనిచేసి తీగలకు రంగులేసి, మార్బుల్స్‌ను పాలిష్ చేసి మరమ్మతులు పూర్తయినట్లుగా చూపించారని తెలిసింది.
దాదాపు 143 ఏళ్లనాటి సస్పెన్షన్ బ్రిడ్జి ఆధునీకరణ పనుల కోసం ఏడు నెలలు మూసి ఉంచి..పర్యాటకులను అనుమతించలేదు. ఇటీవల పనులు పూర్తయ్యాయని, పర్యాటకుల కోసం తిరిగి తెరచుకోవచ్చని ఒరేవా గ్రూప్ చైర్మన్ జైకుష్ పటేల్ గత నెల 24న ప్రకటించారు. స్థానిక పురపాలక సంఘం నుంచి ఎలాంటి భద్రతా పరమైన అనుమతులు, నాణ్యతా ధ్రువ పత్రం తీసుకోకుండా నిర్వహణ సంస్థ పర్యాటకులను బ్రిడ్జిపైకి పర్యటకులను అనుమతించింది. ఈ క్రమంలో గత నెల 30న తీగల వంతెన కుప్పకూలడంతో 135 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 100 మందికిపైగా గాయపడ్డారు.
Also Read : గుజరాత్ లో ఘోరం.. కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి