మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఈ సాయంత్రం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశం అవుతారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. తనను, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను సంప్రదించాకే ఈటెల ఢిల్లీ వెళ్ళారని చెప్పారు. నియంతృత్వ పోకడ అవలంబిస్తున్న కెసియార్ ను గద్దె దించేందుకు అందరూ కలిసి రావాలని కోరారు.
ఈటెల చేరికపై బిజెపిలో సానుకూల వాతావరణం ఉందని, నేతలు ఎవ్వరూ వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఛాతీ ఆస్పత్రికి కేంద్ర మంత్రి అంబులెన్సు అందజేశారు. ఈ సందర్భంగా ఈటెల బిజెపిలో చేరుతున్న అంశంపై స్పందించారు. ఈటెల రాకను వ్యతిరేకిస్తూ పార్టీ సీనియర్ నేత ఇ. పెద్దిరెడ్డి వ్యక్తం చేసిన అసంతృప్తి పై పార్టీలో చర్చిస్తామమన్నారు.
కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం 11 కంపెనీల్లో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు ఉత్పత్తి చేస్తున్నామన్నారు. డిసెంబర్ నాటికి దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. లాక్ డౌన్ సడలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని, ప్రజలకు భారం కాకుండా వైద్య సేవలు అందించాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలను కిషన్ రెడ్డి కోరారు.