Mosquitoes and Diseases – The Economic Cost of Mosquito Borne Diseases:
“కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్”
అని ఏనుగుల గుంపు దోమ నోట్లోకి వెళ్లిన విషయాన్ని తెలివయిన తెనాలి రామలింగడు అయిదు శతాబ్దాల కిందటే గుర్తించాడు. దోమ గొంతులోకి అప్పటినుండి ఇప్పటిదాకా ఆగకుండా వెళుతున్న ఏనుగుల గుంపును మనం మామూలు కళ్లతో చూడలేమనుకుని తెనాలే మళ్లీ ఆ మాటను సవరించి-
“రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు కొల్వు పాలైరకటా!
సంజయా! విధి నేమందును
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ !”
మహా భారతంలో అజ్ఞాతవాసంలో పాండవులనే ఏనుగుల గుంపు విరాటరాజు అనే దోమ కొలువులో తలదాచుకున్నారు అని ప్రతీకాత్మకంగా సమస్యాపూరణం చేసి చెప్పాడు.
ఇదివరకు అష్టావధానం ఒక సాహితీ క్రీడ. అందులో దత్తపది, సమస్యా పూరణం, నిషిద్ధాక్షరి, ఆశువు, వ్యస్తాక్షరి, వర్ణన, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం ఇలా రకరకాలుగా పృచ్ఛకులు అవధానిని పరీక్షించేవారు. అవధానం తెలుగు భాషకు మాత్రమే సొంతమయిన గొప్ప సాహితీ ప్రక్రియ. అందుకే త్వరగా గుంత తీసి, అవధానాన్ని బొందపెట్టి, ఇక పైకి లేవకుండా కాంక్రీటుతో గట్టి సమాధి కట్టి, బతికి ఉండగానే తలకొరివి పెట్టి తిలా పాపాన్ని తలా పిడికెడు పంచుకున్నాం.
అన్నమయ్య వెంకన్నలో రాముడిని చూస్తూ రాసి, పాడిన దేవ దేవం భజే సంస్కృత కీర్తన వాల్మీకి రామాయణ సారంతో సమానం. సాహిత్య, సంగీతాల్లో ఉత్తమోత్తమ కీర్తన ఇది. పవన్ కళ్యాణ్ కోసం అత్తారింటికి దారేది సినిమాలో ఈ కీర్తన ఎత్తుగడను త్రివిక్రమ్ వాడుకోబట్టి ఆధునిక తరానికి పరిచయమయ్యింది. అలా అవధానం గొప్పతనం కూడా ఏ త్రివిక్రములో అసందర్బంగానయినా సినిమాలో చెబితే తప్ప ఇప్పటి తరానికి తెలిసే అవకాశం లేదు. అయినా మన గొడవ అవధానం గురించి కాదు. సమస్త మానవ కుంజర యూధాలన్నీ దోమ గొంతుక జొచ్చిన…తెనాలి రామలింగడే మళ్లీ బతికి వచ్చినా పూరించడానికి వీలు లేని సమస్య గురించి. దోమ కాటు, దోమల బాధ, దోమలతో రోగాలు, దోమ తెగులు, దోమ సమస్యల గురించి. మనం ఎంత కుంజరాలమయినా దోమ గుయ్ అనగానే భయపడాల్సిందే. దోమ కాటు వేయగానే రక్తం చిందించాల్సిందే. దోమలు దాడి చేస్తే రోగాలబారిన పడి ఆసుపత్రుల పాలు కావాల్సిందే. మలేరియాలు, డెంగీలు, చికెన్ గున్యాలు తెచ్చుకోవాల్సిందే.
ఏటా భారతదేశంలో దోమల వల్ల వచ్చే రోగాలకు వైద్యం కోసం అక్షరాలా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఒక పెద్ద రాష్ట్రం వార్షిక బడ్జెట్లో పావు వంతు. ఈ లెక్కన ప్రపంచ వ్యాప్తంగా దోమల బడ్జెట్- సారీ… దోమల వల్ల వచ్చే రోగాలను నయం చేసుకోవడానికి అయ్యే బడ్జెట్ హీన పక్షం ఏటా రెండు లక్షల కోట్ల రూపాయలకు తక్కువ ఉండదు.
దోమల కళ్లకు చూపు పోయేలా జన్యు మార్పిడి చేస్తూ పొతే అవి మనుషులను చూడలేవు; కుట్టలేవు అని ఒక అమెరికా శాస్త్రవేత్త అద్భుతమయిన ప్రయత్నం చేస్తున్నాడని వార్త. మంచిదే. చూపు పోయినా దోమలు వాటి చావేదో అవి చచ్చి…మనల్ను చంపకపోతే చాలు.
ఇక్కడ ఒక చిన్న సందేహం. గుడ్డెద్దు చేలో పడ్డట్టు చూపు లేని దోమ మనల్ను చూడకుండా కుట్టిన చోట కుట్టకుండా కుట్టదని ఈ అమెరికా శాస్త్రవేత్త గుడ్డి దోమల తరపున ఏమయినా హామీ ఇవ్వగలడా? ఆయన ఇచ్చినా దోమలు ఆ హామీని నిలబెట్టుకుంటాయా?
వెనకటికి ఒక ముఖ్యమంత్రి కాకినాడ వెళ్లి దోమల మీద మహా యుద్ధం ప్రకటించి, ఒరలో కత్తి తీయకముందే- దోమల చేతిలో ఓటమిని అంగీకరించి ససైన్యంగా బతుకు జీవుడా అనుకుంటూ వెనక్కు తిరిగి వచ్చాడు.
ఆడ దోమలు మాత్రమే మనుషులను కుట్టి, రక్తం కళ్లజూస్తాయి. మగ దోమలు కొమ్మలను, పువ్వులను కుట్టి బతుకుతాయి. మగ దోమలు అనాదిగా వెజిటేరియన్. ఆడ దోమలు అనాదిగా నాన్ వెజిటేరియన్. నరమాంస భక్షకులు. ఇందులో శ్లేషకానీ, నిందార్థం కానీ, వ్యంగ్యం కానీ లేనే లేదు. ఇంటర్ లో నేను చదువుకున్న జీవ శాస్త్రం ప్రకారమే చెబుతున్నా. ఇప్పుడు మారి ఉంటే తప్పు నాది కాదు.
ఈ గొడవలన్నీ ఎందుకని అవతార పురుషుడై, సకల బ్రహ్మాండాలను తన కంటి చూపుతో శాసించగల తిరుమల వెంకన్న రాత్రిళ్లు పన్నగపు దోమ తెరలో పడుకుంటున్నాడు. కాకపోతే- మనం బట్ట దోమ తెర వాడుతాం. ఆయన పన్నగపు- అంటే ఆదిశేషుడి పడగను దోమ తెరగా వాడుతున్నాడు. మన మాంస నేత్రాలకు దోమలే కనపడతాయి.
“విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య?”
అని అన్నమయ్య స్పష్టంగా పన్నగపు దోమ తెర పైకెత్తి నా విన్నపాలు విను అని యావత్ తెలుగు సాహిత్యంలోనే ఇంకెవ్వరూ అడగని రీతిలో అడిగాడు. వెంకన్న నిద్ర మేల్కొని, దోమ తెర పైకెత్తి, అన్నమయ్య విన్నపాలు ఓపికగా విన్నాడు. దోమలముందు ఏ మందులూ పనిచేయవని దేవదేవుడికే క్లారిటీ ఉంది. ఇక మనమెంత?
సర్సర్లే. ఎన్నెన్నో అనుకుంటాం…అన్నీ అవుతాయా ఏంటి?
సాయంత్రమవుతోంది. తలుపులు మూయాలి. కిటికీలు వేయాలి. గుడ్ నైట్లకు ఆలవుట్లు కావాలి. బ్యాట్లు పట్టుకుని గుగ్లీలకు బ్యాటింగ్ చేయాలి. అసురసంధ్య వేళ దోమకాసుర బృందాలు వస్తున్నాయ్. బతికి ఉంటే బలుసాకు అయినా తినవచ్చు. కళ్లున్న దోమలు చూసి పద్ధతిగా పొడుస్తుంటేనే నరకం కనిపిస్తోంది. ఇక కళ్లు లేని దోమలు కసిగా పొడిస్తే యముడికయినా యమ యాతనే.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read: స్వయంభువును నేను
Also Read: లైఫ్ లో లైఫ్ ట్యాక్స్ కట్టం