Friday, March 29, 2024
HomeTrending NewsForest University: వేప చెట్లకు తెగులుపై అధ్యయనం

Forest University: వేప చెట్లకు తెగులుపై అధ్యయనం

భారత అటవీ పరిశోధన, విద్యా మండలి (ICFRE) డెహ్రాడూన్, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ- దూలపల్లి కలిసి పనిచేసేందుకు నిర్ణయించాయి. అటవీ సంబంధిత విషయాలపై అధ్యయనం, సిబ్బంది శిక్షణ (Research & Training)లో కలిసి పనిచేసేందుకు ఈ రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కార్యక్రమానికి అటవీ పరిశోధన, విద్యా మండలి డైరెక్టర్ జనరల్ ఏ.ఎస్. రావత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

అటవీ పరిశోధన, విద్యా మండలి నేతృత్వంలో హైదరాబాద్ కేంద్రంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB) పనిచేస్తోంది. అటవీ పరిరక్షణ విధానాలు, నేల మరియు తేమ పరిరక్షణ, అటవీ చెట్ల జాతుల అభివృద్ది, వృక్షాలకు వచ్చే చెదలు- వ్యాధుల నివారణ, ఆధునిక పద్దతుల ద్వారా సిబ్బంది శిక్షణపై ఫారెస్ట్ బయోడైవర్సిటీ సంస్థ అధ్యయనం చేస్తోంది. రెండు సంస్థల మధ్య ఒప్పందం నేపథ్యంలో తెలంగాణ వాతావరణం, చెట్ల జాతులు, అటవీ అభివృద్దిపై దృష్టి పెట్టాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ కోరారు. వేప చెట్లకు వస్తున్న తెగులు విషయంలో మరింత అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు చూపాలని కోరారు. అలాగే రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా అగ్రో ఫారెస్ట్రీ విధానాలను అభివృద్ది చేయాలని, గంధపు చెట్ల (శాండల్ వుడ్) పెంపకానికి పెరిగిన ఆదరణ, మార్కెట్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని మంచి మొక్కల వంగడాలను అందుబాటులోకి తేవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం ఫలాలను, పర్యావరణ పరంగా చేకూరిన లబ్దిపై కూడా అధ్యయనం చేయాలని పీసీసీఎఫ్ కోరారు. జాతీయ సంస్థ దగ్గర ఉన్న ఆధునిక సాంకేతికత ఆధారంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తామని డైరెక్టర్ జనరల్ ఏ.ఎస్. రావత్ అన్నారు.

కార్యక్రమంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైశ్వాల్, పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎం.సీ. పర్గెయిన్, ఐఎఫ్ బీ డైరెక్టర్ ఈ. వెంకట్ రెడ్డి, ఫారెస్ట్ అకాడెమీ డైరెక్టర్ ఆశ, సీసీఎఫ్ రామలింగం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్