Sunday, September 8, 2024
HomeTrending Newsబాబూ, పవన్ నయవంచకులు - ఎంపీ భరత్

బాబూ, పవన్ నయవంచకులు – ఎంపీ భరత్

రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గీయులు అన్ని విధాలా టీడీపీ హయాంలో అణచివేయబడ్డారని, నమ్మించి నట్టేట ముంచారని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ధ్వజమెత్తారు. సోమవారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ ఇద్దరికిద్దరూ నయవంచుకులేనని ఆరోపించారు. ప్రజలను వంచించేందుకు జత కట్టారు తప్పిస్తే ప్రజలకు సేవ చేయడానికి కాదన్నారు.
గతంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం బీసీలకు ఏమి చేసిందో, అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ఏమి చేసిందో తేల్చుకుందామా అని ఎంపీ భరత్ సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ చేసినట్లు నిరూపిస్తే నేను క్షమాపణ చెబుతా. మీరు చేసే ఆందోళనకు సంఘీభావం తెలుపుతా. లేదంటే మీరు నాకు క్షమాపణ చెబుతారా అని ఎంపీ ప్రశ్నించారు. రాజకీయాలలో నలభై ఏళ్ళ సీనియార్టీ అని చెప్పుకునే చంద్రబాబు బీసీలను కేవలం ఓట్ల బ్యాంకుగా, పల్లకీ మోసే బోయలుగా మాత్రమే వాడుకున్నారు తప్పిస్తే.. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చైతన్యవంతులను చేయడానికి ఏనాడూ కృషి చేయలేదన్నారు. ఇంకా ఎంత కాలం ప్రజలను మోసగిస్తారని ప్రశ్నించారు.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగనన్న తనకు ఎంపీ టికెట్ ఇచ్చి, లక్ష ఓట్ల మెజారిటీతో నెగ్గించి బీసీలపై ఆయనకున్న ప్రేమను నిరూపించారన్నారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ వార్డు మెంబరు నుండి రాజ్యసభ స్థానం వరకూ, వివిధ నియామక పదవులలో బీసీ జనాభా దామాషా ప్రకారం నియమించి న్యాయం చేశారన్నారు. ఈ రోజు రాష్ట్రంలో 84 వేల మంది బీసీ సామాజిక వర్గీయులను వివిధ పదవులలో నియామించారన్నారు. బీసీల సంక్షేమానికి లక్షల కోట్లు కేటాయించిన ఘనత కూడా జగనన్నకే దక్కుతుందన్నారు. ఇంత చేసినా ప్రతిపక్షాలు బీసీలకు ఏమీ చేయలేదని విమర్శించడం అవివేకం, అజ్ఞానం తప్పిస్తే మరేమీ కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఏళ్ళ కిందట ఒక్క దేవేంద్ర గౌడ్ కు తప్పిస్తే చంద్రబాబు తన రాజకీయ చరిత్రలో ఏనాడైనా రాజ్యసభ స్థానాన్ని బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్నాయనే భయంతో మళ్ళా ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఓట్ల కోసం కొంగ జపం చేస్తున్నారని విమర్శించారు.

వైసీపీ తరపున రాష్ట్రంలో 175 స్థానాలకు పోటీ చేస్తాం..టీడీపీ పొత్తు లేకుండా 175 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తుందా, అంత దమ్ముందా చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రుడా ఛైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, వైసీపీ నేతలు పాలిక శ్రీను, డాక్టర్ అనసూరి పద్మలత, మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Also Read : అప్పులకు ఆదిపురుషుడు బాబు: భరత్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్