కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పిసిసి అధ్యక్ష పదవి ఆశించిన కోమటిరెడ్డి అది దక్కక పోవటంతో కొన్నేళ్లుగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఉత్తమ కుమార్ రెడ్డి తర్వాత అవకాశం వస్తుంది అనుకుంటే అధిష్టానం నుంచి నిరాశే ఎదురయ్యింది. దీనికి తోడు ఎంపి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరాక పార్టీలో ఇబ్బందికర వాతావరణం నెలకొంది.
అధిష్టానం స్టార్ క్యాంపేనర్ అనే పదవి కట్టబెట్టినా ఎంపి కోమటిరెడ్డి సంతృప్తి చెందలేదు. పైగా మునుగోడు ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా.. సోదరుడికి అనుకూలంగా మాట్లాడిన ఆడియో పార్టీ నాయకత్వానికి ఆయనను మరింత దూరం చేసింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధుల కోసమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తరచుగా కలవటం వెంకట్ రెడ్డి వైఖరిని చెప్పకనే చెప్పింది.
కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నేతలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అనే భావనలో ఉన్నారు. కొందరు నేతలు బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలాంటి నేతల వల్ల ప్రజల్ల్లో పార్టీ చులకన అవుతుందని విమర్శలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సి ఉంది. తాజా పరిణామాలు పరిశీలిస్తే వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా ఈసారి గెలుస్తాడనే ధీమా లేదు.
అయితే పార్టీ మార్పుపై ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిన్ననే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తో సమావేశం అయ్యానని… ఎవరో గిట్టని వారు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read : రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే – ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి