తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతి కుమారిని నియమిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
సోమేశ్ కుమార్ ను ఏపీ కేడర్ కు వెళ్ళాలని హైకోర్టు నిన్న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమేశ్ ను వెంటనే తెలంగాణా కేడర్ నుంచి రిలీవ్ చేసి రేపటిలోగా (జనవరి 12న) ఏపీ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది.
కొత్త సిఎస్ ఎంపికపై సిఎం కేసిఆర్ నేటి ఉదయంనుంచి అందుబాటులో ఉన్న సీనియర్ మంత్రులు, నేతలపై చర్చలు జరిపి చివరకు శాంతి కుమారివైపే మొగ్గు చూపారు. ఆమె గతంలో సిఎంవో లో కూడా పనిచేశారు. కోవిడ్ సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శాంతి కుమారి క్రియాశీలకంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు పేరు చివరి వరకూ వినిపించినా పలు సమీకరణలను దృష్టిలో పెట్టుకొని శాంతికుమారిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.
1989 బ్యాచ్ అధికారిణి అయిన శాంతి కుమారి ప్రస్తుతం అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.
తనను సిఎస్ గా నియమించినందుకు సిఎం కెసిఆర్ కు శాంతి కుమారి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రగతి భవన్ లో సిఎం ను కలుసుకున్నారు.