పవన్ కళ్యాణ్ కాకినాడలో పోటీపై నిర్ణయం తీసుకోవాలని, లేదా దమ్ముంటే పిఠాపురం లో తనమీద పోటీకి సిద్ధం కావాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. జనసేన అధినేతకు ముద్రగడ నేడు మరో బహిరంగ లేఖ రాశారు. పవన్ అభిమానులు తనకు అసభ్యంగా మెసేజ్ లు పెడుతున్నారని, ఇలాంటి వాటికి భయపడి లొంగుబాటుకు వచ్చే వాడిని కాదని స్పష్టం చేశారు. తాను ఆయన మోచేతి నీళ్ళు తాగడం లేదన్నారు. అభిమానులతో తిట్టించాల్సిన అవసరం ఏముందని, మీ దగ్గర డబ్బు ఉంది కదా అని వారితో తిట్టిస్తారా అంటూ ప్రశ్నించారు. ద్వారంపూడి ఎమ్మెల్యేతో కలిపి తనపై విమర్శలు చేసినందుకో మొన్నటి లేఖ రాయాల్సి వచ్చిందని తెలిపారు. సినిమాల్లో తప్ప రాజకీయాల్లో మీరు హీరో కాదన్న విషయం గమనించాలన్నారు. గోచీ, మొలత్రాడు లేనివారితో తిట్టించడం మగతనం కాదని, దమ్ముంటే మీరే తిట్టాలని ఛాలెంజ్ విసిరారు. యువతను భావోద్వేగానికి గురి చేస్తున్నది ఎవరి ప్రసంగాలో ఆలోచించుకోవాలన్నారు.
చెగువేరా ఆదర్శమని, గుండెల నిండా ధైర్యముందని చెప్పుకునే పవన్ కు తన సవాల్ పై స్పందించే శక్తి, పౌరుషం ప్రదర్శించాలని లేఖలో సూచించారు. మొదటినుంచీ కాపులకు తాను అండగా నిలబడ్డానని, వారి సమస్యల కోసం పోరాడానని, కానీ పవన్ కాపులకు ఎప్పుడు ఉపయోగపడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాకినాడ, పిఠాపురం రెండూ కాకపోతే కనీసం కోనసీమ నుంచి తోట త్రిమూర్తులుపై అయినా పోటీకి దిగాలన్నారు.
ఎన్నికల బరిలో ఉండాలా వద్దా అని ఆలోచించుకుంటున్న సమయంలో పవన్, జనసేన కార్యకర్తలు తిట్టడం వల్ల ఎక్కడా లేని ఉత్సాహం వచ్చి యుద్దానికి రెడీ అవాలనే వాతావరణం కల్పిస్తున్నందుకు చాలా సంతోషమని, బంతిని ఎంత గట్టిగా కిందకు కొడితే అంత గట్టిగా పైకి లేస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలని ముద్రగడ హెచ్చరించారు.