ప్రజలతో తప్ప ఎవరితోనూ తనకు పొత్తులు ఉండబోవని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరితోనైనా పొత్తు ఉంటే అది ప్రజలతోనేనని…. విపక్షాల లాగా తనకు కుయుక్తులు తెలియవని, అబద్ధాలు చెప్పడం తెలియదని వ్యాఖ్యానించారు. పన్నాగాలు పన్నడం తెలియదని… ‘నేరుగా చెప్తాను, ఏది చెప్తానో అది చేస్తాను’ అంటూ సిఎం తేల్చి చెప్పారు. అంగబలం, అర్థబలం, మీడియా బలం లేకపోయినా.. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ను సిఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో విపక్షాలపై విమర్శలు చేశారు.
“ప్రజలకు ఇంత మంచి జరుగుతుంది కాబట్టే… స్కాములు తప్ప స్కీములు తెలియని బాబులకు, అధికారంలో ఉండగా దోచుకో-పంచుకో-తినుకో అనే డిపిటి మాత్రమే తెలిసిన లంచావతారాలకు, గజదొంగలకు, వయసు పెరిగినా బుద్ధి పెరగని క్రిమినల్ మంచావతారాలకు…. సామాజిక అన్యాయం తప్ప న్యాయం తెలియని పరాన్నజీవులకు… మీ బిడ్డలను ఎదుర్కోలేక… చెప్పుకునేందుకు ఒక్క మంచి కూడా లేక…. జిత్తులు, ఎత్తులు, పొత్తులు, కుయుక్తులతో రాజకీయాలు చేస్తున్నారు” అంటూ విపక్షాలపై దుమ్మెత్తి పోశారు. ‘నవరత్నాలతో మీ బిడ్డ ఎదురవుతుంటే…. అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక తోడేళ్ళందరూ ఒక్కటవుతున్నారు’ అంటూ ధ్వజమెత్తారు.
అందుకే ప్రతి విషయంలోనూ ఆలోచన చేసి మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నది కొలమానంగా తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘మీకు మంచి జరిగితే మీ బిడ్డకు మీరే తోడుగా ఉంది సైనికులుగా నిలవండి, మీ బిడ్డకు ఉన్నది మీరే, అందుకే మీరే సైనికులు కావా’లంటూ జగన్ పిలుపు ఇచ్చారు.
Also Read : YSRCP: అందరం కలిసి సాగుదాం: జగన్