తమ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని నమ్మితే ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ప్రతిపక్షాల నుద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎందుకు తోడేళ్ళు ఏకమవుతున్నాయని నిలదీశారు. ఇంటింటికీ, అన్ని వర్గాలకూ అందిన సంక్షేమ ఫలాల విషయంలో తమ ప్రభుత్వంతో పోల్చుకునే అర్హత ఏమాత్రం లేనివారు తమ మీద రాళ్ళు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరువూరులో జరిగిన కార్యక్రమంలో జగనన్న విద్యాదీవెన కింద అక్టోబర్ – డిసెంబర్ 2022 త్రైమాసికానికి 9.86 లక్షల మందికి 698.68 కోట్లరూపాయలను విద్యార్ధుల తల్లిదండ్రుల అకౌట్లలో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం ప్రసంగిస్తూ తాజా రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు.
“నా ధైర్యం మీరే, నా నమ్మకం మీరే, నన్ను నడిపించేది మీరే, నా ప్రయాణంలో నిరంతరం… నేను ఎవరిమీదైనా ఆధారపడి ఉంటే అది దేవుడి మీద, మీమీద” అంటూ ప్రజలనుద్దేశించి భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా, దమ్ము, ధైర్యం మీకుందా అని మరోసారి సవాల్ విసిరారు. ఎన్ని కుతంత్రాలు చేసినా చివరకు మంచే గెలుస్తుందని, రామాయణం, భారతం, బైబిల్, ఖురాన్ ఏది చూసినా ఇదే సందేశం ఉంటుందని… అలాగే ఏ సినిమాకు వెళ్ళినా హీరోలే నచ్చుతారని అన్నారు. “నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు, నా నిరుపేద అవ్వా తాతలు, నా అక్కచెల్లెమ్మలు, నా రైతన్నలు… వీరందరూ నిండు మనస్సుతో నాకు తోడుగా నిలబడాలని.. మంచి జరిగిన ప్రతి ఇల్లూ తనకు అండగా నిలబడాల”ని కోరారు. 45 నెలలో తమ ప్రభుత్వం ఎలా పనిచేసిందో, ఎంత మేలు చేసిందో ఆలోచించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
నిత్యం ప్రజలకు మంచి చేయాలని చూస్తున్న తమ ప్రభుత్వం… కుటుంబ, రాజకీయ, మానవతా విలువలు లేని ఓ దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తోందని వ్యాఖ్యానించారు. డిబిటి (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) అందిస్తోన్న తాము గతంలో డిపిటి(దోచుకో, పంచుకో, తినుకో) విధానం అవలంబించినవారితో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు.
తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, తానేటి అనిత, మెరుగ నాగార్జున, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, అధికారులు హాజరయ్యారు.