Misunderstood: పాన్ ఇండియా స్టార్ రానా, ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం విరాటపర్వం. ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో సాయి పల్లవి ఓ ప్రశ్నకు సమాధానంగా సాయిపల్లవి కశ్మీరీ పండిట్ల ఊచకోత, ఆవులను తరలిస్తున్న వ్యక్తుల హత్యల పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
కొందరు సాయిపల్లవిని తీవ్రంగా విమర్శించగా, మరికొందరు ఆమెకు మద్దతు పలుకుతున్నారు. కాగా, తన వ్యాఖ్యలు వివాదస్పదం అవ్వడంతో సాయిపల్లవి స్పందించారు. తన వివరణతో సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇంతకీ సాయిపల్లవి ఏమన్నారంటే.. ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు అన్నారు. తాను మాట్లాడిన మాటల్లో కొన్నింటినే పరిగణనలోకి తీసుకుని తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు.
మీరు రైట్ వింగ్ కు మద్దతు ఇస్తారా? లెఫ్ట్ వింగ్ కు మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించారని, ముందు మనం మంచి మనుషులుగా జీవించాలన్న ఉద్దేశం వచ్చేట్టు సమాధానం ఇచ్చానని సాయిపల్లవి స్పష్టం చేశారు. కానీ, తాను చెప్పిన విషయాలను తప్పుగా అర్థం చేసుకుని ఇష్టంవచ్చినట్టు ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హింస అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందేనని ఉద్ఘాటించారు. తాను మొదట ఓ డాక్టర్ నని, ప్రాణం విలువ తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని స్పష్టం చేశారు. ఏదేమైనా తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే అందుకు తనను క్షమించాలని అన్నారు.