బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నినాని వ్యాఖ్యానించారు. ఈ పోర్టు కోసం 19 ఏళ్ళ నుంచీ ప్రభుత్వాల వెంటపడ్డామని, వైఎస్సార్ మరణంతో పోర్టు ఆగిపోయిందని అన్నారు. రేపు సోమవారం (మే 22) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బందరులో పర్యటించి పోర్టు నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళితే పోర్టు నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదని సిఎం జగన్ భావించారని, అందుకే బందరు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తోందని చెప్పారు. ఈ భూమి ఉన్నంత వరకూ బందరు పోర్టు ప్రజల ఆస్తిగానే ఉంటుందని భావోద్వేగంతో చెప్పారు.
వందకు వంద శాతం 1700 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మాణం జరుగుతోందని, రైతుల నుంచి ఎలాంటి బలవంతపు భూ సేకరణ చేయలేదని స్పష్టం చేశారు. పోర్టు నిర్మాణం ద్వారా మచిలీపట్నంతో పాటు జిల్లా ముఖచిత్రం కూడా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. నిన్నటిదాకా కలగా ఉన్న ఈ నిర్మాణం నేడు సాకారం అవుతోందని, నూటికి నూరు శాతం ఈ క్రెడిట్ సిఎం జగన్ కే దక్కుతుందన్నారు. తండ్రి సంకల్పాన్ని కొడుకు నేరవేరుస్తున్నాడని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం తన అదృష్టమని, గతంలో ఎన్నిసార్లు బందరు రావాలని సిఎం ను అడిగినా పోర్టు నిర్మాణ పనులు మొదలుపెట్టే వరకూ రానని తేల్చి చెప్పారని, చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు వచ్చి పనులు మొదలు పెడుతున్నారని పేర్ని నాని వివరించారు.