శర్వానంద్ మొదటి నుంచి కూడా నిలకడగా తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో కథల ఎంపిక విషయంలో అతను తడబడ్డాడు అనే విషయాన్ని ఆ సినిమాల ఫలితాలే చెప్పాయి. వచ్చేనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఒకే ఒక జీవితం’ మాత్రం తప్పకుండా హిట్ అవుతుందని శర్వానంద్ బలంగా చెబుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు. ” ఒక్కోసారి కథ వినగానే నా పాత్ర చేయడానికి పెద్దగా ఏమీ లేదని తెలిసిపోతూనే ఉంటుంది. కానీ ఒక మంచి కథ జనంలోకి వెళ్లాలనే ఉద్దేశంతో చేస్తాను. ‘శతమానం భవతి’ అలా చేసిందే.
ఏ సినిమా చేసినా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతోనే చేస్తాము. లేకపోతే ఆ సినిమా కోసం అంత కష్టపడలేం .. దానికి గురించి జనంలో మాట్లాడలేం. ఒకటి రెండు సినిమాలు మాత్రం అవి ఆడవనే సంగతి ముందుగానే తెలిసిపోతుంటుంది. ఎంత నమ్మకం పెట్టుకుని చేసినా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. నా సినిమాల ఫ్లాప్ కి నేనే బాధ్యత వహిస్తాను. ఏ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందనేది ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకుని మరోసారి అలాంటి పొరపాటు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటాను.
నేను స్టార్ డమ్ కంటే కథనే నమ్ముతాను. నన్ను ఇక్కడివరకూ తీసుకుని వచ్చింది నేను ఎంచుకున్న కథలే. ‘ఒకే ఒక జీవితం’లో కొత్త పాయింట్ ఉంది. అందువల్లనే కథ వినగానే ఓకే చెప్పేశాను. ఆ తరువాత సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చేస్తున్నాను. దాని తరువాత యూవీ బ్యానర్లో మరో సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఈ బ్యానర్లో ఇంతవరకూ నేను చేసిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. ఇంతవరకూ నా సినిమాల కథాకథనాలపై మాత్రమే దృష్టిపెట్టాను. ఇకపై బడ్జెట్ ను కంట్రోల్ చేస్తూ ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై కూడా శ్రద్ధ పెడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.