వెండితెరపై ప్రతిభను .. ప్రభావాన్ని చూపించిన తొలితరం నటులలో చిత్తూరు నాగయ్య ఒకరు. గుంటూరు జిల్లా ‘రేపల్లె’లో జన్మించిన నాగయ్య అసలు పేరు ఉప్పలదడియం నాగేశ్వరం. శ్రీమంతుల కుటుంబంలోనే పుట్టినప్పటికీ, ఆయనకి ఊహతెలిసేనాటికి ఆస్తులన్నీ కరిగిపోయాయి. దాంతో ఆయన ఆర్థికపరమైన ఇబ్బందులను చూస్తూనే పెరిగారు. మొదటి నుంచి కూడా నాగయ్యకు నాటకాల పట్ల .. సంగీతం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందువలన ఆయన దృష్టి అంతా కూడా వాటిపైనే ఉండేది. చదువు పట్ల పెద్దగా ఆసక్తి లేకపోయినా ఎలాగో డిగ్రీ పూర్తయిందని అనిపించారు.
నాగయ్య పాటలు .. పద్యాలు బాగా పాడేవారు. చిత్తూరు ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి ఎక్కువగా నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఏదైనా ఉద్యోగం చూసుకోమనే ఇంట్లోవారి పోరుపడలేక అక్కడక్కడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసినప్పటికీ, ఆ పనులు ఆయనకి అంతగా సంతృప్తిని ఇవ్వలేదు. దాంతో ఆయన ఇక సినిమాల దిశగా అడుగులు వేశారు. పాట – పద్యం తెలిసి, నాటకాలలో అనుభవం ఉన్నవారికే అప్పట్లో సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవారు. అందువలన ఆయన ఆ దిశగా గట్టిగానే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు.
అయితే అనుకున్నంత తేలికగా అవకాశాలు రాకపోవడం వలన, ఆయన ఆర్ధికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుళాయి నీళ్లతో కడుపునింపుకుంటూ .. పార్కు బెంచిపై పడుకుంటూ అదే పనిగా వేషాల కోసం తిరిగారు. చివరికి ఆయన ప్రయత్నం ఫలించడంతో, హెచ్ ఎమ్ రెడ్డిగారి ‘గృహలక్ష్మి’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేసే ఛాన్స్ వచ్చింది. 1936లో వచ్చిన ఆ సినిమాలో ఆయన నటన .. పాట అందరి మనసులను దోచుకున్నాయి. 1939లో కథానాయకుడిగా ఆయన ‘వందేమాతరం’ సినిమా చేశాడు. ఇక అప్పటి నుంచి నాగయ్య కెరియర్ పరంగా వెనుదిరిగి చూసుకోలేదు.
ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమయ్యే పేదవాడిగా .. హుందాతనం కలిగిన జమీందారుగా .. బాధ్యత తెలిసిన ఆడపిల్లల తండ్రిగా .. కుటుంబ సభ్యులను అదుపులో పెట్టే పెద్దరికం కలిగిన పాత్రలలో నాగయ్య జీవించారు. ఇక భక్తుల పాత్రలలోను .. మహర్షుల పాత్రలలోను ఆయన ఒదిగిపోయారు. తెలుగు తెరపై వాల్మీకి .. వశిష్ఠుడు అంటే ఇప్పటికీ కళ్లముందు కదలాడేది నాగయ్య రూపమే. ఆ తరువాత కాలంలో ఎన్టీఆర్ … ఏఎన్నార్ .. ఎస్వీఆర్ .. గుమ్మడి వంటివారు స్టార్స్ అయిన్నప్పటికీ, వాళ్లంతా కూడా ఆయనను ఎంతో అభిమానించేవారు .. గౌరవించేవారు.
నాగయ్య చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే, ‘భక్త పోతన’ .. ‘భక్త రామదాసు’ .. ‘త్యాగయ్య’ .. ‘యోగి వేమన‘ సినిమాలు మరో ఎత్తుగా కనిపిస్తాయి. ఆ సినిమాల తరువాత ఆయన కీర్తి ప్రతిష్ఠలకు ఆకాశమే హద్దుగా నిలిచింది. ఎంతోమంది జమీందారులు ఆయనను ఆహ్వానించి సన్మాన సత్కారాలు చేసేవారు. ఒకానొక సమయంలో ఆయన ఇంట సంపదలు కురిశాయి. ఆ సమయంలోనే మద్రాసులో ఆయన 52 ఎకరాల తోటను కొన్నారు. అప్పట్లో నాగయ్య గారి తోట అని దాని గురించి గొప్పగా చెప్పుకునేవారు.
నాగయ్య దర్శక నిర్మాతగా మారిన తరువాత, ఆ తోట ప్రదేశంలో ఒక స్టూడియోను నిర్మించాలని అనుకున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టారు కూడా. అయితే ఆ తరువాత ఆయన చాలామంది చేతుల్లో మోసపోతూ వచ్చారు .. ఆర్ధికంగా నష్టపోతూ వచ్చారు. మంచితనమే తన బలమని నాగయ్య భావిస్తే, అది ఆయన బలహీనతగా భావించి చాలామంది మోసం చేశారు. ఫలితంగా నాగయ్య ఇళ్లతో పాటు .. తోటతో పాటు అన్నీ కోల్పోయారు. నాగయ్య ఏ స్థితి నుంచి వెళ్లి లక్షలు సంపాదించారో, తిరిగి మళ్లీ అదే స్థితికి వచ్చారు. స్టూడియో నిర్మించాలనే ఆయన కల అలా నెరవేరకుండానే పోయింది.
నాగయ్య నుంచి సహాయాన్ని పొందినవాళ్లు చాలామంది ఆయనను తప్పించుకుని తిరిగారు. ఆయన ఆఫీసులో రోజుల తరబడి ఆకలి తీర్చుకున్నవారు అటుగా వెళ్లడమే మానేశారు. అప్పుడు కూడా ఆయన తన గురించి కాకుండా వాళ్లు పడుతున్న అవస్థలు చూసి నవ్వుకున్నారు. అత్యధిక పారితోషికం అందుకున్న ఆయన, అతి తక్కువ పారితోషికం తీసుకుని అతిథి పాత్రలు వేశారు. నాగయ్య అతి మంచితనమే ఆయనకి ఆ పరిస్థితిని తెచ్చిపెట్టింది.
కొంతమంది వలన ఆయన ఆస్తులు కరిగిపోవచ్చు. కానీ జనం గుండెల్లో నాగయ్య రూపం ఎప్పటికీ కరిగిపోదు .. చెరిగిపోదు. తెలుగు సినిమా ఉన్నంతవరకూ మూలవిరాట్టుగా ఆయన స్థానం కనిపిస్తూనే ఉంటుంది. ఆయన పాటలు .. పద్యాలు వినిపిస్తూనే ఉంటాయి. నటుడిగా .. దర్శక నిర్మాతగా .. సంగీత దర్శకుడిగా .. గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న నాగయ్య, అందుకు కొలమానంగా ‘పద్మశ్రీని అందుకున్నారు. ఈ రోజున ఆయన జయంతి .. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆయనను స్మరించుకుందాం!
– పెద్దింటి గోపీకృష్ణ
Also Read :