వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా తాను పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను సినీ హీరో అక్కినేని నాగార్జున ఖండించారు. అలంటి వార్తలను తాను పట్టించుకోనని, అయినా ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇలాంటి వదంతులు వస్తూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఏదైనా పొలిటికల్ స్టోరీ వస్తే సినిమాలో లీడర్ గా నటించేందుకు సిద్ధమని వెల్లడించారు. నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాగార్జున తన పొలిటికల్ ఎంట్రీపై స్పష్టత ఇచ్చారు.
నాగార్జున 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం గత రెండు మూడు నెలలుగా జరుగుతోంది. ఆయనకు ఖద్దరు డ్రస్ వేసి వైసీపీ కండువా కప్పిన ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఏపీ సిఎం వైఎస్ జగన్ తో నాగార్జున కున్న సన్నిహిత సంబంధాల కారణంగా ఈ వార్త నిజమేనని అందరూ భావించారు. దీనిపై నాగార్జున నేడు వివరణ ఇచ్చారు.
2014ఎన్నికల్లోనే మచిలీపట్నం, ఏలూరు లేదా విజయవాడ నుంచి పోటీ చేస్తారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు.