కింగ్ నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘బంగార్రాజు’ చిత్రాలతో మెప్పించారు కానీ.. యాక్షన్ మూవీస్ వైల్డ్ డాగ్, ‘ది ఘోస్ట్’ చిత్రాలతో మెప్పించలేకపోయారు. దసరాకి వచ్చిన మూవీ ఖచ్చితంగా సక్సెస్ అందిస్తుంది అనుకున్నారు కానీ.. ఏమాత్రం మెప్పించలేకపోయింది. దీంతో నాగార్జున ఇక నుంచి ఎలాంటి సినిమాలు చేయాలి అని బాగా ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం ‘బిగ్ బాస్ 6’ సీజన్ కు హోస్ట్ గా చేస్తున్నారు. డిసెంబర్ లో ఈ సీజన్ కంప్లీట్ అవుతుంది. ఆతర్వాత ఏ సినిమా చేయాలి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటారట. జనవరిలో కొత్త సినిమాని ప్రకటించనున్నారని సమాచారం.
అయితే..మోహనరాజా డైరెక్షన్ లో నాగార్జున సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి. మోహనరాజా కూడా నాగార్జునతో సినిమా చేయనున్నట్టుగా ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అనుకున్నారు. నాగార్జున ది ఘోస్ట్ రిలీజైన తర్వాత ఈ సినిమాని ప్రకటించాలి అనుకున్నారు. అయితే.. ది ఘోస్ట్ మూవీ ప్లాప్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆలోచనలో పడ్డారు. మోహనరాజా ఇప్పుడు హిందీ మూవీ చేయాలి అనుకుంటున్నారు. నాగార్జున ఈసారి రీమేక్ చేయాలి అని డిసైడ్ అయ్యారని సమాచారం.
ఇంతకీ ఏ మూవీని రీమేక్ చేస్తారంటే.. మలయాళంలో విజయం సాధించిన పోరింజు మరిమమ్ జోస్. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో జోషీ రూపొందించిన ఈ మూవీ ఇది.
తెలుగులో కృష్ణంరాజుతో అంతిమ తీర్పు వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన జోషీ ఈ మూవీని రూపొందించారు. 2019లో విడుదలైన ఈ సినిమా అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీని చూసిన నాగార్జున ఇంప్రెస్ అయ్యారట. దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్సయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. త్రినాథరావు నక్కిన రూపొందించిన పలు సినిమాలకు రైటర్ గా వ్యవహరిస్తూ వస్తున్న ప్రసన్న కుమార్ బెజవాడ ఈ రీమేక్ తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ రీమేక్ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారట. మరి.. ఈ సినిమాతో అయినా నాగార్జున సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.