కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లు మళ్లీ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఎరిస్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ కేసులు భారత్‌తో పాటు పలుదేశాల్లోనూ నమోదయ్యాయి. ఈ క్రమంలోనే మరో వేరియంట్ పుట్టుకువచ్చింది. దీనికి ‘పిరోలాస ( BA.2.86) అని పేరు పెట్టారు. ఇది ఒమిక్రాన్ వేరియంట్ సబ్ వేరియంట్. పిరోలా కేసులు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ సమయంలోనే చాలా దేశాల్లో కేసులు నమోదయ్యాయని నిపుణులు పేర్కొన్నారు. కొత్త వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘వేరియంట్ అండర్ మానిటరింగ్‌గా వర్గీకరించింది. ఒరిజినల్ వేరియంట్‌తో పోలిస్తే పిరోలా 35 కంటే ఎక్కువ ఉత్పరివర్తనాలను కలిగి ఉందని.. ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
పిరోలా వేరియంట్ కేసులు ఇజ్రాయెల్, కెనడా, డెన్మార్క్, యూకే, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ దేశాల్లో నమోదయ్యాయి. 2021లో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్‌లో ప్రపంచవ్యాప్తంగా భారీగా కరోనా కేసులతో పాటు మరణాలు పెరిగాయి. తాజాగా సబ్ వేరియంట్ ‘పిరోలా’ మరెంత ప్రమాదం పొంచి ఉందోనని పరిశోధకులు ఆందోళనకు గురవుతున్నారు. పిరోలా వేరియంట్‌లో ఉత్పరివర్తనాలు చాలా భిన్నంగా ఉన్నాయని, 36 మ్యుటేషన్లు ఉన్నాయని, ఇవి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ నుంచి సులభంగా తప్పించుకోగలవని, తక్కువ సమయంలో ఎక్కువ మందికి సోకే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కొత్త వేరియంట్‌కు సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోందని, వాస్తవంగా ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందో ఇంకా తెలుసుకోవాల్సి ఉందని వైద్య నిపుణులు తెలిపారు. కొత్త వేరియంట్ కొవిడ్ టీకాలు తీసుకున్న వారికి సైతం సోకుతుందని, అయితే, తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన కార్డియాలజీ నిపుణుడు, స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్‌స్లేషనల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఎరిక్ టోపోల్ స్పందిస్తూ.. కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో 30 ఉత్పరివర్తనాలు ఉన్నాయని, ఇవి మానవకణాల్లోకి సులువుగా ప్రవేశించడానికి వీలు కల్పిస్తాయన్నారు. పిరోలా మ్యుటేషన్లు గతంలోని వచ్చిన వేరియంట్లో పోలిస్తే భిన్నంగా ఉన్నాయన్నారు. మునపటి వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ ఎంత తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందో తెలుసుకోవాల్సి ఉందని సీడీసీ పేర్కొంది.