Monday, November 25, 2024
HomeTrending Newsవిఙ్ఙానదాయకం..వినోదాత్మకం నంది నాటకం

విఙ్ఙానదాయకం..వినోదాత్మకం నంది నాటకం

గుంటూరు శ్రీ వెంకటేశ్వర విఙ్ఞాన మందిరంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం కళా ప్రాంగణంలో జరుగుతోన్న 2022నంది నాటకాలు ప్రేక్షకుల ఆదరణ మధ్య ఘనంగా జరుగుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్ధ ఆధ్యర్యంలో జరుగుతున్న ఈ నాటక వేడుకలు నేడు మంగళవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. పౌరాణిక కథాంశాలు, సాంఘిక, సామాజిక అంశాలతో విఙ్ఞాన వినోదాల సమ్మేళనంగా ప్రదర్శిత య్యాయి. బాల, యువ నటీ నటులు కూడా దశాబ్దాల నటనానుభవం వున్న నటులతో పోటీగా మంచి నటనానుభవాన్ని రంగరించి తమ నటనా ప్రతిభను ప్రదర్శించారు. ప్రేక్షకులు హాస్య, కరుణ రసాత్మక సన్నివేశాల సమయంలో ప్రతిస్పందిస్తూ, కరతాళ ధ్వనులతో, కేరింతలతో ఉత్సాహపరిచారు. కొందరు కుటుంబసమేతంగా వచ్చి ప్రదర్శనలు తిలకించటం కనిపించింది.

1. సీతాకల్యాణం పౌరాణిక పద్యనాటకంసీతాకల్యాణం పౌరాణిక పద్య నటకం మంగళవారం నాటి తొలి ప్రదర్శన. నాగశ్రీ రచనకు అన్నెపు దక్షిణామూర్తి దరశకత్వం వహించారు. శ్రీ సీతారామంజనే నాట్యమండలి కాకినాడ వారు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. రామాయణంలోసీతా కల్యాణం జరిగిన నేపధ్యంలో నాటకం రూపొందింది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగ సంరక్షణ కోసం తీసుకు వెళ్లటం, అక్కడ రాక్షస సంహారం అయిన తరువాత మిథిలకు సీతా స్యయం వరానికి బయలు దేరటం లాంటి సన్ని వేశాల కల్పన బాగుంది. దీనితో పాటు సీతా స్వయంవరానికి బయలు దేరుతున్న లంకాధిపతిని నారదుడు తెలివిగా అడ్డుకుని లోకక్షేమం కోసం అడ్డుకుని ఆపటం లాంటి సన్నివేశాల కల్పనలో నాటకీయత బాగుంది.

2. తథాబాల్యం బాలల నాటిక:
రెండో ప్రదర్శన కధనం క్రియేషన్స్, క్రాంతి కాన్వెంట్ హైస్కూల్ కొండపల్లి వారు ప్రదర్శించిన నాటిక తథాబాల్యం. అమ్మ సెంటి మెంట్ను, నేటి బాలల్లో సాంకేతిక పరిఙ్ఞానం మీద వున్న ఆసక్తిని సమ్మిళితం చేసి కవి పీఎన్ఎం రచన, దర్శకత్వాలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాటిక ఇది. ఓ విద్యార్ధి కల నేపధ్యం ఈ నాటిక ఇతివృత్తం. డోరేమాన్ లాంటి ఒక బొమ్మ రోబోను తయారు చేసి దానికి మరణించిన తన తమ్ముడు డుంబు పేరు పెట్టి డుంబు కోసం రోదిస్తున్న తల్లిని ఆబొమ్మతో ఓదార్చటం తదితర సనినవేశాలలో బాలలు మంచి నటనను కనబరచారు. తల్టిబిడ్డ కోసం రోదించే సన్నివేశాలు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాయి. బొమ్మను తయారు చేసిన హర్ష ప్రెండ్స్ తోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేస్తున్న ఆ బొమ్మ సమాజంలో పెద్దలకొక నీతి, చిన్నలకొక నీతిలా పరిస్థితులుండటం చూసి తట్టుకోలేక పోతుంది. పిల్లలకు బుద్ధిచెప్పాల్సిన పెద్దలు తప్పుదోవలో నడవ కూడదని సందేశమిచ్చింది ఈ నాటిక.

3.ది ఇంపోస్టర్స్ (అంతా నిజమే చెబుతారు) నాటిక:
ఈ నాటకానికి జె.బి.ప్రీస్ట్లీ రచన యాన్ ఇన్స్పెక్టర్ కాల్స్ ప్రేరణ. ఇది ఒంటరిగా జీవనాన్ని సాగించే ఒక మామూలు ఆడపిల్ల కథ. పదిమంది కోసం ప్రశ్నించడమే అలవాటు చేసుకున్న ఒక పువ్వంటి ఆడపిల్ల జీవితంలోకి ధనవంతుల క్రౌర్యం, వంచన, హింస ఎలా ప్రవేశిస్తాయో, వాటి ప్రభావంగా ఆ ఆడపిల్ల జీవితం ఎలా ముగిసిపోయిందో తెలియజేసే విషాద గాధ. ప్రీస్ట్లీ రచనలోని మూలాన్ని మాత్రం తీసుకుని మన భారతీయ తెలుగు జీవితాలకు అన్వయించటం ఈ నాటిక ప్రత్యేకత. అలకనంద అనే ఆడపిల్ల కుటుంబం నివాసం ఉన్న చోట ఒక పెద్ద మాల్ కట్టేందుకు ప్రభుత్వం ఒక పెట్టుబడిదారుడికి అనుమతి ఇచ్చింది. కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ ఉద్యోగం ఇస్తాననే హామీతో అతను అక్కడ మాల్ నిర్మిస్తాడు. అయితే చదువుకున్న వాళ్లకీ, చదువులేని వాళ్లకీ కూడా సెక్యూరిటీ గార్డులుగానే ఉద్యోగాలు ఇస్తాడు. జీతాలు పెంచడు. జనాన్ని పోగుచేసి అతను చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది అలకానంద. దాని ఫలితంగా ఉద్యోగంకోల్పోయింది. విషాదానిక గురిఅయింది. మిత్రా క్రియేషన్స్ హైదరాబాద్ వారు
ఎన్.ఎమ్.బాషా రచించన, ఆకురాతి భాస్కరాచారి దర్శకత్వంలో రూపొందిన ఈ నాటికను ప్రదర్శించారు.

4. ఇంకానా? నాటిక:ఇది కళాశాల, విశ్వవిద్యాలయ విభాగ నాటిక. యంగ్థియేటర్ ఆర్గనైజేషన్, సిద్ధార్ధ మహిళాకళాశాల విజయవాడ విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ఇది. యువతరం నాటక రంగంలో రాణిస్తున్న తీరును తెలియచెప్పిందీనాటిక. ఆచారం పేరుతో అనైతికత, అసమంజసత్వం, అన్యాయం, రకరకాల రూపాల్లో స్వార్థ, సంకుచిత, అమానవీయ శక్తుల రూపాల్లో ప్రపంచ వ్యాప్తంగా స్త్రీమూర్తులను వేధిస్తున తీరును చూపించింది ఈ ప్రదర్శన. అయితే సమాజం అభివృద్ధి చెందిందని ఇకపై ఇలాంటి దుర్మార్గాలకు చరమ గీతం పాడాలని ప్రబోధించిందీనాటిక. శ్రీశ్రీ గీతంలోని ఇంకానా ఇకపైసాగదు… అనే గీత పాదాన్ని తీసుకుని అంతే అభ్యుదయ భావాలతో ఎస్ఎస్ నారాయణ బాబు రచనకు వాసు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇంకానా.

5. ఆస్తికలు
పిన్నమనేని మృత్యుంజయ రావు రచనకు నాయుడు గోపీ దర్శకత్వంలో గంగోత్రి పెదకాకాని వారు ఈ నాటికను ప్రదర్శించారు. ఆస్తులు సమకూర్చుకోవడం డబ్బులు పోగేసుకోవడం సమస్త జీవజాలంలో మనిషికొక్కడికి మాత్రమే ఉన్న విపరీత లక్షణం. ఇది అవాంఛనీయం, ప్రకృతి విరుద్ధమని చాటి చెప్పిన నాటికక ఇది. శ్రీ రమణ కథ ఆధారంగా ఈ నాటిక రూపుదిద్దుకుంది. బ్రతికినంతకాలం ఆస్తులు పోగెయ్యడమే లక్ష్యంగా బ్రతికిన బసవయ్యకు చచ్చి దెయ్యమయ్యాక గానీ తన జీవితం ఎంత నికృష్టమైందో అర్థం కాలేదు. తన పిల్లలు కూడా తనలాగే ఆస్తుల కోసం వెంపర్లాడటం చూసి….బసవయ్య ఆత్మ ఎంత క్షోభ పడిందో ఆసక్తికరంగా నాటికలో కనిపించింది.

6. శ్రీకృష్ణ – కమలపాలిక- పద్యనాటకం
మంగళవారం ప్రదర్శనలు పద్య నాటకంతో ప్రారంభమై పద్యనాటకంతో ముగిశాయి. మధ్యలో సాంఘిక సామాజిక అంశాలతో కూడిన ప్రదర్శనలు చోటుచేసుకుని అందరినీ అలరించాయి. కర్నూలు లలితకళా సమితి వారు పల్లేటి లక్ష్మీకులశేఖర్ రచనకు పత్తి ఓబులయ్య దర్శకత్వం వహించిన ఈ నాటకాన్ని ప్రదర్శించారు. భారత కథ ఆధారంగా రచించిన నాటకం ఇది కమలపాలిక (హిడింబి) భీముని వరించటం, ఘటోత్కచుని జననం ఘటోత్కచుడు, కమలపాలిక యుధ్ద సమయంలో పాండవులకు అనుకూలంగా శ్రీకృష్ణుడి పధకానుసారం వుండి ప్రాణాలను సహితంత్యాగం చెయ్యటం లాంటి వీరోచిత సంఘటనలు నాటకానికి సొబగులద్దాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్