Saturday, January 18, 2025
Homeసినిమాకొంతమందికి కొన్ని సెట్టవుతాయంతే: నాని 

కొంతమందికి కొన్ని సెట్టవుతాయంతే: నాని 

సంతోష్ శోభన్ హీరోగా ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ రూపొందింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించిన ఈ సినిమా, నవంబర్ 4వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లోని ‘జేఆర్సీ కన్వెన్షన్’ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. వెంకట్ బోయనపల్లి ఇంతకుముందు నానీతో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాను నిర్మించాడు. ఆ సాన్నిహిత్యం కారణంగా నాని ఈ ఈవెంటుకి ముఖ్య అతిథిగా వచ్చాడు. అలాగే గౌరవ అతిథిగా మారుతి వచ్చాడు.

ఈ వేదికపై నానీ మాట్లాడుతూ .. “సంతోష్ శోభన్ ను చూస్తే, కెరియర్ తొలినాళ్లలో నన్ను నేను చూసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. తను చాలా సినిమాలు చేస్తున్నాడని విన్నాను. తను ‘గోల్కొండ హైస్కూల్’ సినిమా చేసినప్పుడే ఇతను మంచి హీరో అవుతాడని అనుకున్నాను. తన టైమింగ్ కూడా నాకు బాగా నచ్చుతుంది. మేర్లపాక గాంధీ విషయానికి వస్తే .. తనతో కొంత సేపు మాట్లాడితే ఎవరికైనా వెంటనే నచ్చేస్తాడు.మా ఇద్దరి కాంబినేషన్లో ‘కృష్ణార్జున యుద్ధం’ వచ్చింది. కృష్ణగాడి పాత్ర పైనే కథ మొత్తం నడిచి ఉంటే, సినిమా బ్లాక్ బస్టర్ అయ్యుండేది.

అలా కాకుండా ఇంకొకడిని తీసుకొచ్చి గిటారు ఇచ్చి రాక్ స్టార్ అన్నాడు. రాక్ స్టార్ గొడవ మనకెందుకని నేను అనేసి ఉంటే ఇద్దరికీ బ్లాక్ బస్టర్ పడిపోయేది. నేను కూడా ఏదో మైకేల్ జాక్సన్ లా ఫీలైపోయి సరే చేద్దాం పదా అనేశాను. కొంతమందికి కొన్ని మాత్రమే సెట్ అవుతాయి .. అది మనం ముందే తెలుసుకోవాలి. ఒకరిపట్ల ఒకరికి గల అభిమానంతో మాకు ఆ విషయం ముందుగా తెలియలేదు. మాకు ఒక క్లారిటీ వచ్చేసింది గనుక, నెక్స్ట్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చూస్తాము” అన్నాడు. ఇక మారుతితో ‘భలే భలే మగాడివోయ్’కి సీక్వెల్ చేయాలనుందంటూ  మారుతితోనే ఈ స్టేజ్ పై గట్టిగా చెప్పేయడం కొసమెరుపు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్