Nani as Shyam & Vasu:
చూడటానికి నాని మన కాలనీ కుర్రాడిలా కనిపిస్తాడు. ఆయన సినిమాను మనం థియేటర్లో కూర్చుని కాకుండా, వీధి అరుగుల మీద కూర్చుని ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా ఉంటుంది. అంత సహజంగా నటిస్తాడు గనుకనే నేచురల్ స్టార్ అనే బిరుదును కొట్టేశాడు. సాధారణంగా నాని సహజత్వానికి చాలా దగ్గరగా ఉండే పాత్రలనే చేస్తుంటాడు. అందువలన ఆయన తన సినిమాలకి లుక్స్ మార్చవలసిన అవసరం పెద్దగా ఉండదు. కానీ ఈ సారి మాత్రం ఆయన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా కోసం తన లుక్ ను చాలావరకూ మార్చేశాడు. కాస్ట్యూమ్స్ తో సహా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.
ఇది 70వ దశకంలో కలకత్తా నేపథ్యంలో జరిగే కథ. ఆచారం పేరుతో అప్పట్లో స్త్రీల పట్ల జరిగిన ఒక దురాచారాన్ని అడ్డుకునే శ్యామ్ సింగ రాయ్ పాత్రలో నాని కనిపించనున్నాడు. ఈ పాత్రలో ఆయన సరసన బెంగాలీ యువతిగా సాయిపల్లవి కనిపించనుంది. ఆమె బెంగాలీ చీరకట్టుకు ఇప్పటికే అభిమానులు మనసులు పారేసుకున్నారు. ‘ఎమ్ సి ఎ’ సినిమాతో అలరించిన ఈ జోడీని మరోసారి తెరపై చూడటానికి ప్రేక్షకుల చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఇదే సినిమాలో నాని ‘వాసు’ అనే మరో పాత్రలో కనిపించనున్నాడు. వాసు పాత్ర వర్తమానంలో నడుస్తుంది.
శ్యామ్ సింగ రాయ్ కీ .. వాసుకి మధ్య సంబంధం ఏమిటి అనేది ఇంతవరకూ సస్పెన్స్ గానే ఉంచారు. వాసు పాత్రకి జోడీగా కృతి శెట్టి అందాల సందడి చేయనుంది. వాసు పాత్రలో నాని చాలా సింపుల్ గా కనిపిస్తున్నాడు. అలాగే ఈ పాత్రలో రొమాంటిక్ పాళ్లు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ట్రైలర్ లో చూపించిన నాని – కృతి శెట్టి లిప్ లాక్ లు యూత్ లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాలో మూడవ కథానాయికగా మడోన్నా సెబాస్టియన్ చేస్తున్నట్టుగా చెప్పారు. కానీ ఆమె పాత్రను ఇంతవరకూ రివీల్ చేయలేదు. ఆమె పాత్రకి సంబంధించిన ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు. కథాపరంగా అలా సస్పెన్స్ లో ఉంచాలని అనుకున్నారేమో మరి.
ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇంతవరకూ వదిలిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సిరివెన్నెల చివరిపాట రాసినది ఈ సినిమా కోసమే అనేది ఈ సినిమా ప్రమోషన్స్ లో హైలైట్ చేస్తున్నారు. నిజానికి సాహిత్యం పరంగా ఆ పాట మనసుకు హత్తుకునెలా ఉంది కూడా. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతోనే, వెంకట్ బోయనపల్లి నిర్మాతగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 24వ తేదీన వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని నాని భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.