Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపూలు గుసగుసలాడేనని...

పూలు గుసగుసలాడేనని…

Plants can communicate with Humans….
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె. మా యౌవనమెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మమ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

అంటూ ఊహలకు రెక్కలు తొడిగి సుకుమార పుష్పాలకే మాటలు వస్తే.. అవి తమపై జాలి, కరుణ కల్గేలా ఆవేదన ఎలా వ్యక్తం చేస్తాయో.. నాటి కరుణశ్రీ కలం ఆవిష్కరిస్తే.. అది మహానుభావుడు ఘంటసాల గానమై.. మొత్తంగా పుష్పవిలాపమై తెలుగువారందరినీ ఎంతగా అల్లుకున్న కావ్యమై నిల్చిందో తెలిసిందేగదా!  మరి మొక్కలకు ప్రాణముందని చెప్పిన జగదీష్ చంద్రబోస్ మాటలను నిజం చేస్తూ… కరుణశ్రీ వంటి కవుల ఊహలను నిజం చేసేలా..  ఏకంగా ఆ మొక్కలకే మాటలు వస్తే..? సంభాషించే కొత్త సాంకేతికత ఆవిష్కృతమైతే.. పుష్పవిలాపం వంటి ఓ మొక్కవిలాపమో.. లేక ఆ సౌకర్యాన్ని కల్పించినందుకు,  అందుకు పూర్తి కాంట్రాస్ట్ గా మానవజాతికి కృతజ్ఞతతో  మొక్కసల్లాపమో.. భవిష్యత్ లో ఏ కవి నుంచైనా మానవజాతి చూడవచ్చేమో బహుశా..?!!

సాంకేతికంగా ఇంత ఎదుగుతున్నా… ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో పురోగతి సాధిస్తున్నామని చెప్పుకుంటున్నా.. ఇప్పటికీ పంటపొలాల్లో, ఉద్యానవనాల్లో రైతుల్లో తెలియని అస్పష్టత కనిపిస్తూనే ఉంటుంది.  ఏ మొక్కకు  ఏ పెస్టిసైడ్ వాడితే… చీడపీడల బారి నుంచి కాపాడొచ్చు.. పంటలకు మేలు చేస్తూ పురుగుల సహజ శత్రువులను ఎలా కాపాడొచ్చు… పంట సాగు ఖర్చు ఎలా తగ్గించొచ్చు… నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంటలనెలా పండించొచ్చు… చీడపీడలలో పురుగుమందులను తట్టుకునే శక్తి రాకుండా ఏం చేయొచ్చు… తూనీకలు, సాలీడు వంటి బదనికలను ఎలా నియంత్రించవచ్చు.. పరాన్నజీవుల భరతం ఎలా పట్టొచ్చు.. వీటన్నింటి ద్వారా వాతావరణ సమతుల్యతను ఎలా కాపాడొచ్చు… భూసారం దెబ్బ తినకుండా ఎలా పరిరక్షించుకోవచ్చు… మొత్తంగా పంట కోసం వాడే వీటన్నింటి ఫలితంగా మానవజాతికి నష్టం కాకుండా ఎలా ముందుకెళ్లవచ్చు.. ఇదిగో ఇలా సస్యరక్షణలో ఎన్నో సవాళ్లు..?!!

మరిలాంటి సవాళ్లకిక సమాధానం దొరికినట్టేనా..? సింగపూర్  నన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ పరిశోధకులు మొక్కలకు ప్రాణముంటుందన్న మన జగదీష్ చంద్రబోస్ ప్రతిపాదనలను మరింత ముందుకు తీసుకెళ్లి… సంభాషించేంత స్థాయిలో కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం నిజంగా ఓ విశేషమూ… రాబోయే రోజుల్లో మొక్కలతో పాటే.. అన్నదాతలకెంతో ఉపయోగమూను!

ముందుగా మనం చెప్పుకున్న కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి పద్యాల్లో పూలలాగా.. మొక్కలకే మాటలొస్తే… అవీ అంతకన్నా ఒకింతే తమ ఆవేదనను వ్యక్తం చేసేవేమో? ఎందుకంటే అభివృద్ధి పేరిట ఆస్తులను కొండలు గుట్టలూ చేసుకునేందుకు.. అవే కొండలు, గుట్టలనే దిగమింగే కొండచిలువల రాజ్యంలో.. మొక్కలనెవరిడిగారు గనుక! భారీ భారీ వృక్షాలనే నిర్ధాక్షిణ్యంగా పెకిలించే మానవ సమాజంలో… నిజంగా ఆ మొక్కలతోనే సంభాషించే అవకాశమే వస్తే… అవి మన తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులను తోసిరాజని ఎన్నేసి కొత్త తిట్లు వినిపించి ఆవేశాన్ని వెళ్లగక్కేవో ఫాఫం!!

మనిషంటేనే అంతేగదా..?  కార్బన్ డై ఆక్సైడ్ ను సేవించి మనకు ఆక్సిజన్ అందిస్తున్న మొక్క పట్ల కృతజ్ఞత లేని కృతఘ్నుడాయె!

CO2 + 2 H2O + photons → (CH2O) n + H2O + O2

కార్బన్ డై ఆక్సైడ్ + నీరు + కాంతిశక్తి → పిండిపధార్దాలు + నీరు + ఆక్సిజన్ వంటి అతి ముఖ్యమైన జీవరసాయన చర్యల గూర్చి తెలిసీ… మొక్కల మీద ఆధారపడి జీవించే పరపోషకాలైన జంతుజాతికి చెందిన జీవులన్నింటికీ.. ఈ ప్రక్రియ జీవనాధారమని ఎరిగీ.. మొక్కే కదా అని పీకేసే రకం మనిషి.

అయితే ఇవాళ తెలంగాణా వంటి రాష్ట్రాల్లో కొనసాగుతున్న హరితహారం వంటి కార్యక్రమాలు ఆ మనిషిలో మార్పును కూడా పట్టిచూపుతున్న వైనాన్నీ మనం చర్చించుకుని అభినందించాల్సిందే!

ఇలాంటి సమయంలో మొక్కల ఆకులపై ఉండే విద్యుదావేశంలోని మార్పులను గమనిస్తూ.. వాటికి విద్యుత్ తరంగాలు పంపించే ప్రక్రియతో.. వాటిలో ప్రాణముందని ఇప్పటికే తేల్చిన మొక్కలతో సంభాషించగల్గితే వాటి ఈతి బాధలూ తెలిసే అవకాశముంటుంది.. అలాగే వాటి అవసరాలూ గుర్తించే అవకాశమూ దక్కుతుంది. డయోనియా శాస్త్రీయ నామమైన వీనస్ ఫ్లైట్రాప్ మొక్కకు సంబంధించిన ఆకులపై ఎలక్ట్రోడ్ ను అమర్చి.. స్మార్ట్ ఫోన్ యాప్ తో నియంత్రిస్తూ ఇప్పటికే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు నన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఆ ఎలక్ట్రోడే.. మొక్కనుంచి ఫోన్ కీ, ఫోన్ నుంచి మొక్కకీ విద్యుత్ తరంగాలను పంపిస్తూ.. సృష్టించే విద్యుత్ ఆవేశం ద్వారా మొక్కలకేం కావాలో తెలుసుకోవచ్చట. ఒక స్టెతస్కోప్ తో మనిషి గుండె వేగాన్ని, పనితీరును ఎలాగైతే ఓ వైద్యుడు ప్రాథమికంగా పరీక్షించి మనకు కావల్సిన వైద్యసాయమందిస్తాడో… అలాగే ఈ విద్యుత్ ఆవేశ తరంగాల ద్వారా మొక్కలకు సోకిన తెగుళ్లు, వాటిలో ఉన్న పోషకాల లోపాలనూ తెలుసుకోవడంతో పాటు.. వాతావరణ మార్పులు, పురుగుల మందుల వల్ల మొక్కలకు జరిగే నష్టాల వంటివాటిని అంచనావేసి అధిగమించే అవకాశముందంటున్నారు నన్యాంగ్ నిపుణులు.

సింగపూర్ నన్యాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనే నిజమైతే… ఊహలకు రెక్కలు కట్టి పువ్వులకే మాటలు వస్తే వాటి ఆవేదనెలా ఉంటుందో తన కలం ద్వారా ఆ ఆర్ద్రతను పట్టిచూపిన కరుణశ్రీ తరహాలో… రాబోయే రోజుల్లో ఏ కవినుంచైనా ఓ వృక్షవిలాపమో.. ఓ మొక్కసల్లాపమో కూడా వస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరమేమీ లేదు  సుమీ!

-రమణ కొంటికర్ల

RELATED ARTICLES

Most Popular

న్యూస్