Saturday, November 23, 2024
HomeTrending News117 జీవో రద్దు చేస్తాం: లోకేష్ హామీ

117 జీవో రద్దు చేస్తాం: లోకేష్ హామీ

తాము అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని, వ్యక్తిగతంగా తాను ఆ బాధ్యత చేపడతానని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ పాలనలో ఉత్తరాంధ్ర ఎన్నో రకాలుగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. కనీసం ఒక్క పరిశ్రమ అయినా తీసుకు రాలేకపోయారని, ఒక్కరికీ ఉద్యోగ అవకాశం ఇవ్వలేకపోయారని విమర్శించారు. విశాఖ జిల్లా మాడుగులలో జరిగిన శంఖారావం బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. రైల్వే జోన్, విశాఖ మెట్రో ప్రాజెక్టు, మూతబడిన షుగర్ ఫ్యాక్టరీల పునరుద్దరణ లాంటి అంశాల్లో జగన్ గత ఎన్నికల్లో హామీ ఇచ్చి వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు.

గిరిజనుల సంక్షేమం కోసం తాము చేపట్టిన 17 పథకాలను జగన్ ప్రభుత్వం నిలిపివేసిందని, మరో రెండు  నెలలు ఓపిక పడితే వారిని పునరుద్దరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలా ఉన్న జీవో 117 ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ జీవో వల్ల డ్రాపవుట్స్ సంఖ్య విపరీతంగా పెరిగిందని, దేశంలో ఇది 12.6 శాతం ఉంటే ఏపీలో 16.3 శాతంగా ఉందని వివరించారు.  అందుకే ఈ జీవోను రద్దు చేసి ప్రభుత్వ విద్యను మళ్ళీ పేదల గడప వద్దకు తీసుకు వెళ్తామన్నారు.

స్థానిక ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయారని…. కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. దువ్వాడ షుగర్ ఫ్యాక్టరీకి వంద కోట్ల రూపాయల ఖర్చుతో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్