రైతు బిడ్డ అని చెప్పుకుంటున్న సిఎం జగన్ రాష్ట్రాన్ని రైతు లేని రాజ్యంగా తయారు చేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు సీమలో డ్రిప్ ఇరిగేషన్ కూడా నిర్లక్ష్యం చేశారని అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ కు కావాల్సిన మోటార్లకు కరెంట్ బిల్లులు కూడా కట్టడం లేదన్నారు. ఈ ప్రభుత్వ హయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లితే పట్టించుకునే నాథుడే కరువయ్యదన్నారు. కర్నూలు జిల్లా, మంత్రాలయం నియోజకవర్గం, కోసిగి విడిది కేంద్రం నుండి 81 వ రోజు యువగళం పాదయాత్ర మొదలైంది. డి.బెళగళ్ వద్ద మిర్చిరైతు కర్రియ్యను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం లచ్చుమర్రి క్రాస్ వద్ద రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు.
గ్రామాల్లో ఇంటిపన్ను, చెత్త పన్ను కట్టకపోతే పెన్షన్ నుంచి కట్ చేస్తున్నారని, రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు కూడా ఇలాగే కట్ చేస్తారని లోకేష్ హెచ్చరించారు. మోటార్లకు మీటర్లకు బిగించడం పూర్తయితే రాయల సీమలో వ్యవసాయం చేసే పరిస్థితి కూడా ఉండదన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం ఎన్నో చర్యలు తమ ప్రభుత్వంలో తీసుకున్నామని, రైతుల వెంటపడి మరీ ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ అందించామని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర రాకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా ఆదుకున్నామని తెలిపారు.