పోలవరం నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడి అయిన ఈ ప్రాజెక్టు కోసం త‌మ స‌ర్వ‌స్వం త్యాగం చేసిన నిర్వాసితులు ప్రస్తుతం అత్యంత ద‌య‌నీయ‌స్థితిలో వున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సిఎం వైఎస్ జగన్ కు లోకేష్ లేఖ రాశారు. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న నిర్వాసితుల సమస్యలు ప‌రిష్క‌రించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతిపక్షనేతగా పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని లోకేష్ ప్రశ్నించారు. ప్రతి ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తాన‌ని ఒకసారి, 10 లక్షల రూపాయలు ఇస్తానని మరోసారి మాట మార్చారని ఆరోపించారు. భూమి లేని వారికి రూ.10 లక్షలు ప్యాకేజ్ ఇస్తాన‌ని, వ‌ల‌స వెళ్లిన వారికి కూడా ప్యాకేజీ అమ‌లు, భూమి కోల్పోయిన వారికి భూమి, పోడు భూమి అయితే ప‌ట్టా భూమి ఇస్తాన‌ని హామీ ఇచ్చారని లోకేష్ గుర్తు చేశారు.

పోలవరం వద్ద వైఎస్ విగ్రహానికి 200 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం, వరదల్లో మునిగిపోయిన నిర్వాసితులకు మాత్రం ఒక కొవ్వొత్తి, బంగాళాదుంపలు ఇచ్చారని లోకేష్ మండిపడ్డారు, ఉండడానికి ఇళ్లు, తాగడానికి నీళ్ళు, విద్యుత్ సమస్యలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని,  ఇది గిరిజనుల హక్కులను కాలరాయడమేనని సాక్షాత్తూ జాతీయ ఎస్టీ కమిషన్ చెప్పినా ప్రభుత్వం స్పందించడం లేదని  లోకేష్ విస్మయం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తాన‌ని నాడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *