Friday, November 22, 2024
HomeTrending Newsఎన్ కౌంటర్లతో దద్దరిల్లుతున్న ఛత్తీస్ ఘడ్

ఎన్ కౌంటర్లతో దద్దరిల్లుతున్న ఛత్తీస్ ఘడ్

దేశంలో ఓ వైపు సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంటే మధ్య భారతంలో అడవులు రక్తసిక్తం అవుతున్నాయి. గత నెల రోజులుగా పోలీసులు – మావోల మధ్య జరుగుతున్న ఎదురు కాల్పులతో ఛత్తీస్‌గఢ్‌ దద్దరిల్లుతోంది. తాజాగా నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయారు.

మృతుల్లో మహిళా దళ సభ్యులు ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47తో సహా భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు – జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్త భద్రతా బృందానికి మధ్య మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగినట్లుగా అధికారులు తెలిపారు.

నారాయణపూర్, కాంకేర్ సరిహద్దు ప్రాంతంలోని అబుజ్‌మడ్  లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు సోమవారం ఆపరేషన్‌ కోసం బయలుదేరాయి. టెక్‌మెటా, కాకూర్‌ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. మహిళా మావోయిస్టులతో సహా మొత్తం తొమ్మిది మంది మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. వాటి గుర్తింపు పనులు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. మావోయిస్టుల శిబిరం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఓ ఏకే 47తో సహా నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు.

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగులుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో కాంకేర్‌ జిల్లాలో 29 మంది మావోయిస్టులు చనిపోగా మృతుల్లో సీనియర్‌ నేత శంకర్‌రావు సైతం ఉన్నారు. 16న బినాగుండ, కొరోనార్ గ్రామాల మధ్య హపటోలా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.

మరోవైపు మావొలను తుదముట్టించే వరకు విశ్రమించేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెగేసి చెపుతున్నారు. నెలరోజుల్లోనే మావోయిస్టులు ఒకేసారి ఇంతమంది ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోవడం ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావటం గమనార్హం. రెండు వర్గాల దాడుల్లో అమాయక గిరిజనులు సమిధలు అవుతున్నారని ఆదివాసి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్